దేవదాయ శాఖలో‘సీనియార్టీ’ చిక్కులు

ABN , First Publish Date - 2022-08-17T07:45:38+05:30 IST

దేవదాయ శాఖలో‘సీనియార్టీ’ చిక్కులు

దేవదాయ శాఖలో‘సీనియార్టీ’ చిక్కులు

లేని పోస్టులకు పదోన్నతులు

అదనంగా 13 మందికి ప్రమోషన్‌

అక్రమాల ఫిర్యాదులపై బేఖాతరు

విజిలెన్స్‌ ఆదేశాలు బుట్టదాఖలు

సీనియార్టీ నిర్ధారించకుండానే స్పెషల్‌ ఇంక్రిమెంట్‌కు సిద్ధం

వివాదంగా మారిన నిర్ణయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

దేవదాయ శాఖను సీనియార్టీ సమస్యలు వెంటాడుతున్నాయి. పదోన్నతుల్లో నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రమోషన్స్‌ ఇచ్చేశారు. ఇప్పటికీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్‌ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో దేవదాయ శాఖ చేసిన తప్పులు ఇప్పటికీ సరిదిద్దుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. పైగా ఆ తప్పులను సమర్థిస్తూ మరో కొత్త ఫైల్‌ను దేవదాయ శాఖ తెరపైకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోని దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక శాఖ అనుమతితో 31 సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండేవి. విభజన సమయంలో అధికారులు కమల్‌నాథన్‌ కమిటీకి 51 పోస్టులు ఉన్నట్లు చూపించారు. దీంతో 58:42 నిష్పత్తి ప్రకారం కమల్‌నాథన్‌ కమిటీ ఏపీకి 31, తెలంగాణకు 20 పోస్టులు కేటాయించింది. అసలు ఉన్నవే 31 పోస్టులు అయితే.. అవి మొత్తం ఏపీకి వచ్చినట్లు చూపించారు. నిబంధనల ప్రకారం ఏపీకి 17 పోస్టులు మాత్రమే వస్తాయి. దేవదాయశాఖలోని ఎస్టాబ్లి్‌షమెంట్‌ అధికారులు, ఉన్నతాధికారులు చేసిన తప్పుల వల్ల 31 పోస్టులు వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు దీనిని గుర్తించ లేదు. 2018లో కొంత మంది జూనియర్‌ అసిస్టెంట్‌లకు పదోన్నతులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే దేవదాయ శాఖలో 13 మంది సీనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో ముగ్గురికి మాత్రమే పదోన్నతికి అవకాశముంది. కానీ, అధికారులు ఒకేసారి ఏడుగురికి పదోన్నతులు కల్పించారు. ఇలా ప్రతి 5 నెలలకు ఒకసారి ఐదారుగురికి సీనియర్‌ అసిస్టెంట్లుగా దొడ్దిదారిలో పదోన్నతులు కల్పిస్తూ మొత్తం 30 పోస్టులను భర్తీ చేశారు. వాస్తవంగా ఉన్నవి 17 పోస్టులు అయితే అదనంగా మరో 13 మంది దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. చివరికి విజిలెన్స్‌ అధికారులు కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి ఈ అక్రమ పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. 2018లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ఏడుగురు.. ఆయా పోస్టుల్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తి కావడంతో స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలంటూ దేవదాయ శాఖ కమిషనర్‌కు విన్నవించారు. అయితే, వీరి విషయాన్ని లోతుగా పరిశీలన చేయకుండానే అధికారులు స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేశారు.


విజిలెన్స్‌ లేఖల మాటేంటి?

దేవదాయ శాఖలో అక్రమ పదోన్నతులపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. వాటిపై స్పందించిన విజిలెన్స్‌ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపించాలని, వెంటనే ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖకు లేఖలు రాశారు. ఈ లేఖలను కూడా దేవదాయ శాఖ బుట్టదాఖలు చేసింది. సాధారణంగా విజిలెన్స్‌ సూచనల మేరకు దేవదాయశాఖలోని ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగం ఫైల్‌ సిద్ధం చేయాలి. దీనిని కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లాలి. అసలు ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలోనే అక్రమ పదోన్నతులు పొందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండడంతో సదరు లేఖలను తొక్కి పెట్టారు. ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప అక్రమ పదోన్నతుల ఫైల్స్‌ బయటకు వచ్చే పరిస్థితి లేదనే వాదన వినిపిస్తోంది. 


ఉద్యోగుల అభ్యంతరాలు

దేవదాయ శాఖ 2021 నవంబరులో సీనియర్‌ అసిస్టెంట్లకు సంబంధించి సీనియార్టీ లిస్ట్‌ను జారీ చేసింది. దీనిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలను కోరింది. అయితే, ఈ జాబితాలో తప్పులు దొర్లాయని కొంత మంది ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఈ సీనియార్టీ జాబితాను కూడా పక్కన పెట్టేశారు. ఈ ఒక్క విషయమేకాదు.. దేవదాయ శాఖలో ఏ అంశంపై ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆ ఫైల్‌ కనుమరుగవుతోందనే వాదన ఉంది. ఇలాంటి అక్రమాలకు బ్రేక్‌ వేయాల్సిన ఉన్నతాధికారులు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ పదోన్నతులపై విజిలెన్స్‌ విచారణ చేయించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more