రంగంలోకి ఐఎంఏ!

ABN , First Publish Date - 2022-09-13T09:35:39+05:30 IST

సీనియర్‌ వైద్యులను నియమించాల్సిన డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ పోస్టుల్లో ఐఏఎ్‌సలను కూర్చోబెట్టడంపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

రంగంలోకి ఐఎంఏ!

  • డీఎంఈగా ఐఏఎస్‌ను నియమించడంపై అభ్యంతరం
  • ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళనలకు సంఘీభావం

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ వైద్యులను నియమించాల్సిన డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ పోస్టుల్లో ఐఏఎస్‌లను కూర్చోబెట్టడంపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తన సంఘీభావం తెలుపుతూ ఐఎంఏ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీఎంఈ, ఏపీవీవీపీ పోస్టుల్లో ఐఏఎ్‌సలను నియమించడంపై ఐఎంఏ ఏపీ చాప్టర్‌ ఒక రిపోర్టు సిద్ధం చేసి దాన్ని జాతీయ కార్యాలయానికి పంపించింది. ఏపీలో వైద్యులకు వ్యతిరేకంగా జరుగుతున్న అనేక అంశాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఐఎంఏ జాతీయ చాప్టర్‌ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిసింది. అలాగే రిపోర్టులోని సారాంశాన్ని అన్ని రాష్ట్రాల ఐఎంఏ చాప్టర్‌లకు పంపించనుంది.


 ఈ క్రమంలో నాన్‌ మెడికల్‌ అధికారుల నియామకానికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల చాప్టర్లు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా డీఎంఈ పోస్టింగ్‌ ఇవ్వడం ఇప్పుడు జాతీయస్థాయి సమస్యగా మారింది. దీంతో ఐఎంఏ ఏపీ చాప్టర్‌ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించనుంది. డీఎంఈ పోస్టుల్లో ఐఏఎస్‌లను నియమించడం చట్ట వ్యతిరేకమని ఐఎంఏ సృష్టంగా చెబుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే ప్రభుత్వ వైద్యుల సంఘం చేసే ప్రతి కార్యక్రమానికీ పూర్తి మద్దతు ఇవ్వనుంది. మరోవైపు జీడీఏ నేతలతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని, వెంటనే వాటిని విరమించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ వైద్యుల సంఘం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ పోస్టులో వెంటనే సీనియర్‌ వైద్యులను నియమించాలని డిమాండ్‌ చేస్తోంది.

Updated Date - 2022-09-13T09:35:39+05:30 IST