-
-
Home » Andhra Pradesh » If they make a fuss over Padayatra it is like they did against BJP-NGTS-AndhraPradesh
-
పాదయాత్రపై గొడవ చేస్తే బీజేపీపై చేసినట్లే
ABN , First Publish Date - 2022-09-17T09:10:25+05:30 IST
పాదయాత్రపై గొడవ చేస్తే బీజేపీపై చేసినట్లే

మూడు పేరుతో వైసీపీ కుట్ర: సీఎం రమేశ్
కడప, సెప్టెంబరు 16: ‘‘రాజధాని అమరావతి ప్రాంత రైతులు జరిపే పాదయాత్రపై వైసీపీ నాయకులు ఎలాంటి గొడవలు సృష్టించినా అది బీజేపీపై సృష్టించినట్లే’’ అని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆ పాదయాత్రపై రకరకాలుగా వైసీపీ నేతలు మాటల యుద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపనకు హాజరయిన అమరావతిని కాదని... మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్న తీరు సరైంది కాదన్నారు. అమరావతి అభివృద్ధిని దేశ ప్రధాని రెండింతలు చేసే దిశగా ఉన్నారన్నారు. కాదు, కూడదని మొండికేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తామన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నాయకులు పత్రికల యాజమాన్యాల గురించి పలు రకాల వ్యాఖ్యలు చేయడం సరయింది కాదన్నారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ లపై ఆరోపణలు గుప్పించడం సబబు కాదన్నారు.