అమరావతిలో ధరలు పెరిగితే రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా!

ABN , First Publish Date - 2022-09-13T07:48:58+05:30 IST

‘‘అమరావతిలో మీ భూముల ధరలు పెరుగుతుంటే రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా? విశాఖ పరిపాలనా రాజఽధానిగా వద్దంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే మేం నోరు మూసుకొని కూర్చోవాలా?’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.

అమరావతిలో ధరలు పెరిగితే రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా!

  • మీరు విశాఖ వద్దంటే మేం నోర్మూసుకోవాలా?
  • అరసవల్లి దర్శనం చేసుకోండి...
  • మా పీక మాత్రం కోయకండి: మంత్రి ధర్మాన
  • ఇది కమ్మవాళ్ల పాదయాత్ర: మంత్రి దాడిశెట్టి
  • ‘మూడు’ను అడ్డుకునేందుకే: మంత్రి విడదల


శ్రీకాకుళం, కోటనందూరు(కాకినాడ జిల్లా), సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతిలో మీ భూముల ధరలు పెరుగుతుంటే రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా? విశాఖ పరిపాలనా రాజఽధానిగా వద్దంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే మేం నోరు మూసుకొని కూర్చోవాలా?’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. సోమవారం శ్రీకాకుళంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘మీరు మా పొట్ట కొడుతుంటే.. వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఇళ్లలో పని మనుషులుగానే మిగిలిపోవాలా? విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని చంద్రబాబు అండ్‌ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పు. 40 ఏళ్లకు పైగా రాజకీ య అనుభవం ఉన్న చంద్రబాబుకి హైదరాబాద్‌ విషయం లో ఏం జరిగిందో తెలియదా? చంద్రబాబు మాటలు విని అరసవల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల పీకకోసే పని చేస్తామంటేనే తప్పు. అమరావతి రైతులను రెచ్చగొట్టి మా మీదకు పంపిస్తున్నాడు చంద్రబాబు. రైతులతో ఎలాంటి వివాదం లేదు. ఎన్నేళ్లపాటు రాష్ట్ర సంపదను అమరావతిలో పెట్టాలి? అస లు రాజధాని కోసం 33 వేల ఎకరాలేంటి? ఇదంతా మోసం కాదా? 4, 5 లక్షల కోట్లు అంటే ఎన్ని సంవత్సరాల సంపద ను అమరావతిలో పెట్టుబడి చేయాలని చూస్తున్నావ్‌? అం తవరకూ మిగిలిన రాష్ట్రమంతా నోరుమూసుకుని కూర్చోవా లా? మూడు రాజధానులు వద్దని చెప్పేవారు జీడీపీలో శ్రీకాకుళం వాటా ఎంతనేది చెప్పగలరా? రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలు అభివృద్ధి చెందాలన్నదే సరైన నిర్ణయం. రాజ్యాంగం చెప్పినట్లుగా వనరులన్నీ అందరికీ అందాలి’’ అన్నారు.


రైతుల పాదయాత్ర మోసం: రాజా

‘‘రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర వట్టి మోసం. పాదయాత్ర పేరుతో చంద్రబాబు మరోసారి వంకర రాజకీ యం మొదలుపెట్టాడు. ఇది కమ్మవాళ్ల పాదయాత్ర’’ అని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. సోమవారం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిళ్లనందూరు గ్రామంలో గడపగడపకు కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘విశాఖకు రాజధాని హోదా వద్దని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ విశాఖకు వచ్చి చెప్పే దమ్ముందా? రాజధాని అమరావతి అనేది పెద్ద స్కాం. స్కాంల పార్టీ అని తెలుగుదేశాన్ని ప్రజలు చీకొట్టారు. అమరావతి ప్రాంత రైతు లు ఏముఖం పెట్టుకుని తూర్పుగోదావరి జిల్లా మీదుగా ఉత్తరాంధ్రలోకి వెళ్తారు. బాబు, లోకేశ్‌ రాజధానిగా విశాఖ వద్దంటే ప్రజలు చెప్పులతో కొట్టడం ఖాయం’’ అన్నారు. 


బాబు లబ్ధి కోసమే పాదయాత్ర: మంత్రి రజని

మూడు రాజధానులను అడ్డుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే అమరావతి రైతుల పాదయాత్ర అని మంత్రి విడదల రజని అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురంలో సోమవారం పర్యటించిన మంత్రి తంగుడుబిల్లి గ్రామంలో మాట్లాడారు. ‘‘ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3 రాజధానుల ఏర్పడి తీరుతాయి. విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయం. బాబుకు వయస్సు పైబడింది. కుమారుడు లోకేశ్‌ పాదయాత్ర చేసినా ప్రయోజనం ఉండదని గ్రహించారు. ఈ కారణంగానే అమరావతి రైతులతో పాదయాత్రలు చేయించి లబ్ధిపొందడానికి ప్రయత్నం చేస్తున్నారు’’ అని రజని ఆరోపించారు.

Updated Date - 2022-09-13T07:48:58+05:30 IST