మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేస్తే కేసు పెడతారా?

ABN , First Publish Date - 2022-09-24T10:31:12+05:30 IST

మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేస్తే కేసు పెడతారా?

మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేస్తే కేసు పెడతారా?

41ఏ నోటీసు ఇవ్వకుండానే అరెస్టులా?: రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన మెసేజ్‌ను మరొక గ్రూప్‌నకు ఫార్వర్డ్‌ చేస్తే ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. కులాలు, జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారని, కానీ ఏపీసీఐడీ పోలీసులు మాత్రం మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబుపై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ ఐపీసీ సెక్షన్ల కింద ఒక వ్యక్తిపై  కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడానికి ముందు అతనికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41ఏ నోటీస్‌ కచ్చితంగా ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఏపీసీఐడీ పోలీసుల దమనకాండను ఖండించాలని కోరారు. ఏపీసీఐడీ పోలీసుల చర్యలపై న్యాయస్థానాలలో ప్రైవేటు కంప్లైంట్‌ దాఖలు చేయాలని పిలుపునిచ్చారు. అంకబాబు అరెస్టును జర్నలిస్ట్‌ సంఘాలు ఖండించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను ఏపీసీఐడీ పోలీసుల బారి నుంచి కాపాడాలని, సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ను తక్షణమే తప్పించాలని కోరుతూ డీవోపీటీ కార్యదర్శి, కేంద్ర హోం శాఖకు లేఖలు రాస్తానని తెలిపారు. సునీల్‌కుమార్‌ వ్యవహార శైలిపై ఇప్పటికే తాను 10కి పైగా లేఖలు రాశానని, అయినా ఆయన్ని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని చెప్పారు. 


కుప్పం కాదు... పులివెందులపై ఫోకస్‌ చేయండి

అభివృద్థి చెందిన కుప్పం నియోజకవర్గంపై కాకుండా... పులివెందులపై ఫోకస్‌ చేయాలని జగన్‌కు రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. కుప్పం ప్రజలను ఇళ్లల్లో బంధించి, ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ద్వారా సాధించింది ఏమిటని నిలదీశారు. కాగా, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లౌక్యాన్ని ప్రదర్శించారని రఘురామ వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-09-24T10:31:12+05:30 IST