ఐఈసీ టెండర్‌లో గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2022-05-18T07:44:53+05:30 IST

ఏపీఎంఎ్‌సఐడీసీ(కార్పొరేషన్‌) వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.

ఐఈసీ టెండర్‌లో గోల్‌మాల్‌!

టెండర్‌ ప్రక్రియలో నిబంధనలకు తూట్లు

రాష్ట్రంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంటేనే అర్హత

కానీ, ప్రెస్‌ లేని కంపెనీకి పని కేటాయింపు

జాతీయ స్థాయి కంపెనీలు పాల్గొనేందుకు అడ్డు

కార్పొరేషన్‌ వ్యవహారంపై తీవ్ర విమర్శలు

టెండర్లు రద్దు చేయాలని ఫిర్యాదులు

‘ఎల్‌ 1’ కంపెనీతో నేడు అగ్రిమెంట్‌


అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ఏపీఎంఎ్‌సఐడీసీ(కార్పొరేషన్‌) వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విభాగం ఒక్క టెండర్‌ను కూడా సక్రమంగా నిర్వహించిన దాఖాలాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. రూ.కోటి నుంచి వందల కోట్ల టెండర్ల వరకు ఎక్కడా నిబంధనలు పాటించిన పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో(ఎన్‌హెచ్‌ఎం) ప్రింటింగ్‌ మెటీరియల్‌ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లు విమర్శల పాలయ్యాయి. టెండర్‌ నిబంధనలు పక్కన పెట్టి మరీ కంపెనీలను ఎంపిక చేశారు. ఈ వ్యవహారం ఆరోగ్యశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ టెండర్ల వ్యవహారంపై కొన్ని కంపెనీలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్‌హెచ్‌ఎంలో ఏటా దాదాపు రూ.15 నుంచి రూ.25 కోట్ల వరకు ప్రింటింగ్‌ మెటీరియల్‌(ఐఈసీ) అవసరం ఉంటుంది. దీని సరఫరా కోసం ఎన్‌హెచ్‌ఎం టెండర్ల ద్వారా ఒక కంపెనీని ఎంపిక చేసుకుని తమకు అవసరమైన మెటీరియల్‌ను తెప్పించుకుంటుంది. సరఫరా కంపెనీ ఎంపిక కోసం ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా టెండర్‌ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా 4 నెలల క్రితం టెండర్లు ఆహ్వానించాలని ఎన్‌హెచ్‌ఎం విభాగం ఏపీఎంఎ్‌సఐడీసీని కోరింది. ఏపీఎంఎ్‌సఐడీసీ టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియలో టెక్నికల్‌ బిడ్‌ పూర్తయి.. ఫైనాన్షియల్‌ బిడ్‌ ఓపెన్‌ చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. ఈ రివర్స్‌ టెండరింగ్‌లో ఒక కంపెనీని ఎంపిక చేసినా.. బీఎ్‌ఫసీలో ఆ కంపెనీ సక్రమంగా పని చేయలేదని పేర్కొంటూ ఆ టెండర్‌ ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో టెండర్లు ఎందుకు రద్దు చేశారో కంపెనీలకు అర్థం కాలేదు. ఇదే టెండర్‌ను రెండోసారి ఆహ్వానించారు. తొలిసారి టెండర్‌ పిలిచినప్పుడు ఉన్న నిబంధనలకు.. రెండోసారి టెండర్లు పిలిచినప్పుడు ఉన్న నిబంధనలకు సంబంఽధం లేకుండా చేశారు. టెండర్‌ నిబంధనలు మొత్తం పూర్తిగా మార్చేశారు. తమకు అనుకూలంగా కంపెనీని ఎంపిక చేయడం కోసం నిబంధనలు చేర్చారనే విమర్శలు ఉన్నాయి. 


ఇక్కడే ప్రెస్‌ ఉండాలట!

టెండర్‌లో పాల్గొనే కంపెనీకి ఏపీలో ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉండాలన్న నిబంధన విధించారు. ఈ నిబంధనతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. చివరికి ఎన్‌హెచ్‌ఎం విభాగానికి ఐఈసీ మెటీరియల్‌ సరఫరా చేస్తున్న కంపెనీ కూడా టెండర్‌లో పాల్గొనడానికి వీల్లేకుండా చేశారు. రెండోసారి టెండర్లు ఆహ్వానించినప్పుడు ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. ఎన్‌హెచ్‌ఎం నియమించిన కమిటీ ఈ కంపెనీలను క్వాలిఫై చేసింది. వీటిలో 4 కంపెనీలను ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు టెక్నికల్‌ బిడ్‌ సమయంలో తొలగించారు. రెండు కంపెనీల మధ్య రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. దీనిలో ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు ముందుగానే నిర్ణయించుకున్న కంపెనీని ఎంపిక చేశారని విమర్శలు వస్తున్నాయి. బిడ్‌ ఫైనలైజ్‌ కమిటీలో కూడా దీనిపై పూర్తిస్థాయిలో చర్చంచకుండా, కనీసం టెండర్‌ ప్రక్రియ వివరాలు కోరకుండానే కమిటీ టెండర్‌ను ఆమోదించింది. అయితే, ఇలా ఎంపిక చేసిన కంపెనీకి కూడా ఏపీలో ప్రింటింగ్‌ ప్రెస్‌ లేదు. దీంతో ఇదే విషయాన్ని పేర్కొంటూ.. కొన్ని కంపెనీలు ఏపీఎంఎ్‌సఐడీసీకి, ఎన్‌హెచ్‌ఎంకు ఫిర్యాదులు చేశాయి. కానీ, అధికారులు ఈ ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. 


సర్కారు ఏం చేయనుంది?

జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొననీయకుండా నిబంధనలు మార్చిన ఏపీఎంఎ్‌సఐడీసీపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జాతీయ స్థాయి కంపెనీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇదిలావుంటే, బుధవారం ‘ఎల్‌ 1’గా ఎంపికైన కొత్త కంపెనీతో అగ్రిమెంట్‌ చేసుకునేందుకు ఎన్‌హెచ్‌ఎం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.


Read more