40కోట్లు సుపారీ ఎవరి రక్తచరిత్ర?

ABN , First Publish Date - 2022-03-05T07:47:59+05:30 IST

చేతకానివాడు కులం, మతం, ప్రాంతం గురించి మాట్లాడతాడని, సమర్థుడు అభివృద్ధి చేసి చూపిస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు...

40కోట్లు సుపారీ ఎవరి రక్తచరిత్ర?

వాళ్లు అబద్ధాలు ప్రచారం చేసి గెలిచారు 

మనం ప్రజలకు నిజాలు చెప్పి గెలుద్దాం

తప్పుడు ప్రచారాన్ని గమనించలేకపోవడం 

నా పొరపాటు: ఐటీడీపీ సమావేశంలో చంద్రబాబు

చేతకానివాడే కులం గురించి మాట్లాడతాడు 

సమర్థుడు అభివృద్ధి చేసి చూపిస్తాడని వాఖ్య


అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): చేతకానివాడు కులం, మతం, ప్రాంతం గురించి మాట్లాడతాడని, సమర్థుడు అభివృద్ధి చేసి చూపిస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఐటీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘నేను చేసిన అభివృద్ధిని తప్పుపట్టలేక నాపైనా... అమరావతిపైనా కులం ముద్ర వేయాలని చూశారు. నేను ఒక్క అమరావతి కోసమే శ్రమించానా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ అభివృద్ధికి కూడా శ్రమించాను. హైదరాబాద్‌లో ఏ కులం ఉందని నేను కష్టపడ్డాను? తెలుగువారే నా కులం, మతం, కుటుంబం. హైదరాబాద్‌ అయినా అమరావతి అయినా మొత్తం తెలుగువారు బాగుపడాలని కలలు కని పనిచేశాను. రాజధాని  కోసం రైతులు సహకరించి 33 వేల ఎకరాల భూమి ఇచ్చారు. దాని అభివృద్ధి కొనసాగి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. అమరావతి విధ్వంసం వల్ల జగన్‌రెడ్డికి ఏమీ నష్టం లేదు. రాష్ట్రానికి ఆదాయం పోయింది. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పోయాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి తీర్పును కొన్ని టీవీ చానళ్లు చూపించలేదని, నీలి మీడియా ఆపినంత మాత్రాన ప్రజలకు సమాచారం చేరదనుకోవడం పెద్ద భ్రమ అన్నారు. సామాజిక మాధ్యమాలు బలంగా ఉన్న ఈ రోజుల్లో తీర్పు వచ్చిన కొన్ని గంటల్లో మొత్తం విషయాలు ప్రజలకు చేరిపోయాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్‌రెడ్డి బృందం అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవగలిగారని, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందో నిజాలు ప్రజలకు చెప్పి గెలుద్దామన్నారు. టీడీపీ ప్రభుత్వంపై, తనపై తప్పుడు ప్రచారం భారీగా జరుగుతోందని అప్పట్లో గమనించలేకపోవడం తన పొరపాటేనన్నారు. ‘ఇప్పటికీ ఈ దిక్కుమాలిన ప్రచారాన్ని ఆపలేదు. బాబాయిని చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా? గుండెపోటుతో మొదలై, గొడ్డలిపోటు దాకా వచ్చింది. బాబాయి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు నేనే కారణమంటారు. గుండెపోటని చెప్పింది, హత్య వద్ద రక్తపు మరకలు చెరిపిందీ కూడా నేనేనని అనగలిగిన శక్తిమంతులు వీళ్లు. వివేకాను ఘోరంగా చంపడమే కాకుండా తనను డ్రైవర్‌ ప్రసాద్‌ కొడుతున్నాడని ఆయనతో లేఖ రాయించి మరీ చంపారు. ఇంత ఘోరాలను సినిమాల్లో కూడా చూసి ఉండం. వివేకా హత్యకు సుపారీ ఇచ్చేంత డబ్బు ఎవరివద్ద ఉంది? రూ.40కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న వారికి అనారోగ్య సమస్యలు, కేసుల ఇబ్బందులు వచ్చినా ఆదుకోవడానికి ఆన్‌లైన్‌లోనే నిర్ణయం తీసుకొనే వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. ఐటీడీపీ విభాగంలో పనిచేస్తున్న వారి ఆదాయ మార్గాలు పెంపుపైనా పరిశీలిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.  


వ్యవసాయ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు: చంద్రబాబు 

 విజయవాడ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బోర్ల మోటర్లకు మీటర్లు పెడితే, అవి రైతుల మెడకు ఊరితాళ్లు అవుతాయని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ రూ.50 స్లాబ్‌ రేటుతో రైతుల మోటార్లకు విద్యుత్తు సరఫరా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీటర్లు పెట్టకుండా రైతులు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చా రు. రైతులు ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ప్రభుత్వంపై పోరాడాల్సిన, నిలదీయాల్సిన సమయం వచ్చి ందన్నారు. ఈ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌ దొంగ పనులు చేసి జైలుకు వెళితే.. తాము రైతులు, ప్రజల కోసం చేస్తున్న పోరాటం చేసి జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో ‘రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలి’ నినాదంతో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్కుషాపు ముగిం పు సభలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. టీడీపీ  పాలనలో ఒక్క ఎకరం పంట కూడా ఎండనీయకుండా సమయానికి కరెంటు సరఫరా చేశామని, ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా కరెంటు ఇవ్వకపోవడం వల్ల పంట లు ఎండిపోతున్న దుస్థితి నెలకొందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను టీడీపీ ప్రభుత్వ హయాంలో 72 శాతం పూర్తిచేశామని, ఆ భారీ ప్రాజెక్టును జగన్‌ బ్యారేజీగా మారుస్తున్నారని ఎద్దేవాచేశారు. రైతులను ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను పెడితే.. వైసీపీ ప్రభుత్వంలో కనీసం వ్యవసాయశాఖ పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 11 శాతం వృద్ధిరేటు సాధించగా..వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి ఆరుసార్లు కరెంటు చార్జీలు పెంచి, రూ.10వేల కోట్ల భారాన్ని జనంపై మోపిందని ధ్వజమెత్తారు. సీఎం అనుసరిస్తున్న మూర్ఖ విధానాల వల్ల కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో రైతులు వరిపంట వేయడానికి భయపడుతుంటే.. రాష్ట్రంలో గంజాయి సాగు ను అతిపెద్ద పరిశ్రమగా ప్రభుత్వం తయారు చేసిందన్నారు.

Read more