విశాఖలో హైటెన్షన్‌

ABN , First Publish Date - 2022-10-17T09:20:57+05:30 IST

విశాఖలో హైటెన్షన్‌

విశాఖలో హైటెన్షన్‌

పవన్‌ పర్యటనను అడ్డుకున్న పోలీసులు

‘జనవాణి’కి ర్యాలీగా వెళ్లకుండా నిషేధం..

బసచే సిన హోటల్‌ చుట్టూ భారీగా బలగాల మోహరింపు.. లాఠీచార్జ్‌

శనివారం అర్ధరాత్రి నుంచే తనిఖీలు..

పలువురు జనసేన నేతల నిర్బంధం..

హోటల్‌కు వచ్చే మార్గాల్లో పికెట్లు

పవన్‌తో పోలీసు అధికారుల భేటీ..

పోలీసు యాక్ట్‌-30 అమల్లో ఉందంటూ ర్యాలీ, సమావేశం నిర్వహణకు నో

ఇదే సమయంలో పవన్‌ను అరెస్టు చేస్తారని ప్రచారం..

ఆయన్ను వెళ్లిపోవాలన్నారని కూడా..

దీంతో హోటల్‌ వద్దకు భారీగా అభిమానులు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. రాత్రి వరకు హైడ్రామా

శనివారం అర్ధరాత్రి నుంచే తనిఖీలు

పలువురు జనసేన నేతల నిర్బంధం

హోటల్‌కు వచ్చే మార్గాల్లో పికెట్లు

పవన్‌తో పోలీసు అధికారుల భేటీ

పోలీసు యాక్ట్‌-30 అమల్లో ఉందంటూ ర్యాలీ నిర్వహణకు నిరాకరణ

సభలు, సమావేశాలు జరుపరాదు

డ్రోన్లు కూడా వినియోగించకూడదు

ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక


 విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు పోలీసులు బ్రేక్‌ వేశారు. పోలీసు యాక్టు-30 అమల్లో ఉందంటూ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. జనసేన నేతలను అరెస్టు చేయడమే కాకుండా.. పవన్‌ బసచేసిన హోటల్‌ చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ఫలితంగా జనవాణిని జనసేన రద్దుచేసుకుంది.


విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రశాంత విశాఖ నగరంలో ఆదివారం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాఫ్‌ జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు యాక్టు-30 అమల్లో ఉందంటూ సభలు, సమావేశాలు జరపొద్దన్నారు. శనివారం అర్ధరాత్రే జనసేన నాయకులను అరెస్టు చేయడం.. వారిని వదిలిపెడితే తప్ప ఇక్కడ నుంచి కదిలేది లేదని పవన్‌ భీష్మించుకోవడం.. హోటల్‌ను పోలీసులు చుట్టుముట్టడం.. ఆయన్ను అరెస్టు చేస్తారని, నగరం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారన్న ప్రచారంతో జనసైనికులు, అభిమానులు అక్కడ మోహరించడం తదితర పరిణామాలు ఆదివారం చోటు చేసుకున్నాయి.


ఆంక్షల నేపథ్యంలో చివరకు జనవాణిని రద్దు చేసుకోవలసి వచ్చింది. కాగా.. పవన్‌ బసచేసిన హోటల్‌ను పోలీసులుశనివారం అర్ధరాత్రే తమ అధీనంలోకి తీసుకున్నారు. భారీఎత్తున బలగాలను మోహరించారు. నగర పోలీసులతోపాటు ఏపీఎస్పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వు బలగాలను రప్పించి హోటల్‌ చుట్టూ వలయంగా ఏర్పాటుచేశారు. అక్కడకు దారితీసే అన్ని మార్గాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వాహనాలను ఆపి వివరాలు అడిగిన తర్వాతే అనుమతించారు. జనసేన నేతలు, కార్యకర్తలైతే వెనక్కిపంపించేశారు. హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద కూడా ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాకే విడిచిపెట్టారు.


ఇద్దరు డీసీపీల ఆధ్వర్యంలో హోటల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్‌  బస చేసిన ఆరో అంతస్థులోకి ఎవరినీ అనుమతించలేదు. ఉదయం ఆరు గంటల నుంచే హోటల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపించడంతో అక్కడ బస చేసిన ఇతర అతిథులు ఆందోళన చెందారు. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పవన్‌ హోటల్‌ నుంచి బయలుదేరి పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొనాలి. దీంతో ఆడిటోరియం వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పవన్‌ బసచేసిన హోటల్‌కు క్రైమ్‌ డీసీపీ నాగన్న, ఏసీపీ హర్షితచంద్ర, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ గోవిందరావు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. నగరంలో పోలీసు యాక్ట్‌-30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ నోటీసు ఇచ్చారు. పోలీసు యాక్ట్‌  ఉన్నప్పటికీ శనివారం ఎయిర్‌పోర్టులో 500 మందికి పైగా నేతలతో పవన్‌ గుమిగూడారని.. ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా నోవాటెల్‌కు భారీ ర్యాలీ నిర్వహించారని అందులో ఆక్షేపించారు. మీ ఆధ్వర్యంలోని జనసేన మద్దతుదారులు మంత్రులు, పౌరులు, పోలీసు అధికారులపై దాడి చేసి పబ్లిక్‌ ఆర్డర్‌కు భంగం కలిగించారని.. దాడిలో కొందరు ప్రజాప్రతినిధులు, పౌరులు, పోలీసు అధికారులు గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటన శాంతిభద్రతలకు భంగం కలిగించిందన్నారు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని.. ఆదివారం ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదని, డ్రోన్లు కూడా ఉపయోగించరాదని నోటీసులో స్పష్టం చేశారు.


అయితే దీనిని తీసుకునేందుకు పవన్‌ తొలుత తిరస్కరించారు. తమ లీగల్‌ అడ్వయిజర్‌ రేవతి వచ్చాక పరిశీలిస్తామని చెప్పారు. దాంతో పోలీసులు ఆమె వచ్చేవరకు వేచి ఉన్నారు. అనంతరం నోటీసును లీగల్‌ అడ్వయిజర్‌ ద్వారా ఇవ్వగా కొన్ని సవరణలు సూచించారు. వాటిని పోలీసులు సవరించి నోటీసు అందజేశారు. దానిని అందుకున్న పవన్‌.. ఎయిర్‌పోర్టులో జనం గుడిగూడడంతో తమకు సంబంధం లేదని.. నిరసనగానే నోటీసులు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు.. పవన్‌ను అరెస్టు చేయబోతున్నారని, బలవంతంగా నగరం నుంచి పంపించేస్తున్నారని ప్రచారం జరగడంతో జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హోటల్‌ వద్దకు చేరుకున్నారు. పవన్‌కు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను బసచేసిన గది నుంచే పవన్‌ వారికి అభివాదం చేశారు. దీంతో వారు కేరింతలు, చప్పట్లు కొడుతూ సందడి చేశారు. అయితే పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనవాణి జరిగే పోర్టు స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లడానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో జనసేన నేతలు జనవాణిని రద్దు చేశారు. 


ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన బాధితులు

జనవాణిలో పవన్‌కు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి పలువురు బాధితులు, జనసేన కార్యకర్తల కుటుంబీకులు విశాఖకు తరలివచ్చారు. ప్రమాదవశాత్తూ మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు అదే వేదికపై రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించాలని ఆ పార్టీ నిర్ణయించింది. కానీ జనవాణి రద్దుతో మృతుల కుటుంబీకులను నాయకులు నోవాటెల్‌ హోటల్‌కు తీసుకెళ్లి అక్కడ పవన్‌ చేతుల మీదుగా చెక్కులు ఇప్పించారు. సమస్యలు నివేదించడానికి వచ్చిన వారంతా నిరాశగా వెనుతిరిగారు. ఇంకోవైపు.. పవన్‌ను ఆడిటోరియం వద్ద అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ముందుగానే ప్రణాళిక రచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆందోళనకు దిగారు. ఽస్టేడియం గేటు వద్ద ధర్నా చేశారు. అయితే ఈ సందర్భంగా వారంతా నాన్‌-పొలిటికల్‌ జేఏసీ విశాఖ గర్జనకు తయారుచేసిన జెండాలు పట్టుకుని రావడం గమనార్హం. దీనికి విశాఖ ఉత్తర నియోజవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు నాయకత్వం వహించారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా.. ఆయన వారినే బెదిరించారు.




ఉడతా ఉడతా ఊచ్‌...

మా థానోస్‌ గూట్లో పెడతావా..!

పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్య వరుస ట్వీట్లు


విశాఖపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): బీచ్‌రోడ్డులోని హోట్‌లో 6వ అంతస్థులో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సాయంత్రం వరుస ట్వీట్లు చేశారు. అధికార వైసీపీకి చురకలంటిస్తూ ట్వీట్లు పెట్టారు. వీటిని అభిమానులు, కార్యకర్తలు వందలాదిగా రీ ట్వీట్‌ చేశారు. ‘‘ఉడతా ఉడతా ఊచ్‌.. ఎక్కడికెళ్తావోచ్‌.. రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా..? మా వైసీపీకి ఇస్తావా..? మా థానోస్‌ గూట్లో పెడతావా’’ అంటూ ట్వీట్‌ చేశారు. కొద్దిసేపటి తరువాత ఆర్కే బీచ్‌లో తనకోసం వేచి చూస్తున్న జన సైనికుల వీడియోను ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌చేసి.. ‘‘నా గది కిటికీలో నుంచి పలకరించొద్దని ఏపీ పోలీసులు నాకు చెప్పరని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. అనంతరం ’‘ఒక ఆలోచన నా మనసును దాటింది. ఆర్కే బీచ్‌లో సాయంత్రం నడకకు వెళ్లి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి పోలీసులు నాకు అనుమతి ఇస్తారా?’’ అని మరో ట్వీట్‌ వదిలారు. ‘‘పోలీసులు నన్ను ర్యాలీలు చేయొద్దని, మీటింగ్‌లు పెట్టొద్దని చెప్పారు. కానీ రూములో నుంచి అభిమానులకు అభివాదం చేయొద్దని చెప్పలేదు. దీన్ని అడ్డుకోలేరు కదా’’ అంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-10-17T09:20:57+05:30 IST