ఎన్పీకే ఫెర్టిలైజర్‌ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-08-31T09:30:33+05:30 IST

నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామ పరిధిలో ఎన్పీకే ఫెర్టిలైజర్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు క్రిషక్‌ భారతి కోఆపరేటివ్‌ లిమిటెడ్‌(క్రిబ్కో)కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఎన్పీకే ఫెర్టిలైజర్‌ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామ పరిధిలో ఎన్పీకే ఫెర్టిలైజర్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు క్రిషక్‌ భారతి కోఆపరేటివ్‌ లిమిటెడ్‌(క్రిబ్కో)కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పరిశ్రమ నిర్మాణాలు కాకర్లపల్లి చెరువు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగించకూడదని స్పష్టం చేసింది. సంబంధిత భూములను ఫెర్టిలైజర్‌ పరిశ్రమ ఏర్పాటుకు తప్ప ఏ ఇతర అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అభవృద్ధి నిరోధకాలుగా మారడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ పేరుతో రాష్ట్రాభివృద్ధి నిలిచిపోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.


సర్వేపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.2508లోని 286 ఎకరాల్లో క్రిబ్కో నిర్మించ తలపెట్టిన ఎన్పీకే ఫెర్టిలైజర్‌ పరిశ్రమ కారణంగా కాకర్లపల్లి చెరువుకు వచ్చే నీటికి ఆటంకం ఏర్పడుతుందని, ప్లాంట్‌ను ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ లేదా నిరుపయోగంగా ఉన్న ఇతర సెజ్‌లలో ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరు తూ నెల్లూరుకు చెందిన సీఎ్‌సఆర్‌ కోటిరెడ్డి, వి.నిరంజన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై క్రిబ్కో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఎన్పీకే ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఏళ్ల కిందట ప్రభుత్వం భూమి కేటాయించిందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన సొమ్మును కూడా యాజమాన్యం సిద్ధం చేసుకుందన్నారు. ప్రస్తుత వ్యాజ్యం కారణంగా పరిశ్రమ ఏర్పాటు నిలిచిపోయిందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఐశ్వర్య వాదనలు వినిపిస్తూ పరిశ్రమ ఏర్పాటు వల్ల కాకర్లపల్లి చెరువుకు వచ్చే నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందన్నారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాపై ప్రభావం పడకుండా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్‌ పరిశ్రమ యాజమాన్యానికి సూచించారన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదిస్తూ కలెక్టర్‌ సూచనలు పాటిస్తూ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఫెర్టిలైజర్‌ పరిశ్రమ నెలకొల్పేందుకు క్రిబ్కోకు అనుమతించింది.

Updated Date - 2022-08-31T09:30:33+05:30 IST