ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2022-07-08T02:49:21+05:30 IST

దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన

విశాఖపట్నం: దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఇంకా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. అలాగే గుజరాత్‌ నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్‌ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవనద్రోణి కొనసాగుతుంది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రానున్న ఐదు రోజుల వరకు దక్షిణ, పడమర, మధ్య భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మధ్య మహారాష్ట్రలో పడమర కనుమల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలపై వరద తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2022-07-08T02:49:21+05:30 IST