ఏ బైలా వర్తిస్తుందో తేలుస్తాం: హైకోర్టు
ABN , First Publish Date - 2022-12-16T01:34:48+05:30 IST
ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్(ఏపీహెచ్‌సీఏఏ) నూతన ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నిక నిర్వహించే విషయంలో ఏ బైలా ప్రకారం నడుచుకోవాలో తేలుస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఏపీహెచ్‌సీఏఏ ఎన్నికలపై విచారణ 21కి వాయిదా
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్(ఏపీహెచ్‌సీఏఏ) నూతన ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నిక నిర్వహించే విషయంలో ఏ బైలా ప్రకారం నడుచుకోవాలో తేలుస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏపీ బార్ కౌన్సిల్ అన్వయించుకున్న మోడల్ బైలా వర్తిస్తుందా? లేక ఏపీహెచ్‌సీఏఏ రిజిస్ట్రర్ బైలా వర్తిస్తుందా? అనే విషయాన్ని తేలుస్తామంది. దీనిపై స్పష్టత లేకుంటే భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో అదనపు వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఇరువైపుల న్యాయవాదులను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఏపీహెచ్‌సీఏఏ ఎగ్జిక్యూటివ్ బాడీ కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించక పోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎన్.విజయ్‌భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సింగిల్ జడ్జి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, కార్యదర్శి కె.నర్సిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఈ అప్పీల్ గురువారం విచారణకు వచ్చింది.