నిబంధనలు గాలికి..
ABN , First Publish Date - 2022-10-17T10:05:35+05:30 IST
నిబంధనలు వర్తిస్తాయా? లేవా?.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుందా? లేదా?.. మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేయగలమా? లేదా? అన్న విషయాలు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చెప్పిన సమయానికి కావాల్సినంత మంది వైద్యులను అందుబాటులో ఉంచడం
ఆరోగ్య శాఖలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
డీఎంఈ, ఏపీవీవీపీ చరిత్రలో తొలిసారి
ఇతర రాష్ట్రాల వైద్యులకు అవకాశం
ఇన్సెంటివ్స్ ఇస్తే సర్వీ్‌సలోకి వచ్చేందుకు రాష్ట్రానికి చెందిన వైద్యుల సుముఖత
ఆ అంశం పట్టించుకోని ఆరోగ్య శాఖ
డీఎంఈలో తప్పనిసరి బదిలీలతో కొరత
లాంగ్ లీవ్‌లోకి 40 శాతం మంది వైద్యులు
సమాచారం ఇవ్వకుండా పోస్టులు సరెండర్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నిబంధనలు వర్తిస్తాయా? లేవా?.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుందా? లేదా?.. మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేయగలమా? లేదా? అన్న విషయాలు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చెప్పిన సమయానికి కావాల్సినంత మంది వైద్యులను అందుబాటులో ఉంచడం ఒక్కటే టార్గెట్. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల తీరు ఇలా ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) చరిత్రలో తొలిసారి వాక్-ఇన్ ఇంటర్వ్యూల పేరుతో శాశ్వత, కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుల నియామకాలు చేపడుతున్నారు. ఇప్పటికే నోటిషికేషన్లు ఇచ్చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు విడుదల చేశారు. డీఎంఈ, ఏపీవీవీపీలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుల నియామకాలు చేపట్టాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు సవరణలు చేయకుండానే నియామకాలకు సరికొత్త విధానం కనిపెట్టారు. డీఎంఈలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా లెట్రల్ ఎంట్రీ ద్వారా మాత్రమే నియామకాలు చేపట్టాలి. ఏపీవీవీపీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ నిబంధనలు పట్టించుకోకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూల పేరుతో నియామకాలు చేపట్టేందుకు సర్వసిద్ధం చేశారు. డీఎంఈలో సుమారు 250 మంది వైద్యులను, ఏపీవీవీపీలో 150 మంది వైద్యులను వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా తీసుకోనున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అటానమస్, సెమీ అటానమస్ సంస్థల్లో మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియామకం చేపడతారు. గతంలో రిమ్స్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు ఏర్పాటు చేసినప్పుడు ఈ నిబంధనలు అమలు చేశారు. ప్రభుత్వ సంస్థలుగా ఉన్న మెడికల్ కాలేజీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని సీనియర్ వైద్యులు సృష్టం చేశారు.
జీతాలు పెంచకుండా సాకులు
డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా వైద్యులు రావడం లేదన్న ఉద్దేశంతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వాక్-ఇన్ ఇంటర్వ్యూలను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు నాలుగు వేలమంది, పీజీ పూర్తి చేసిన వైద్యులు దాదాపు వెయ్యిమంది అందుబాటులోకి వస్తున్నారు. సరైన జీతాలు అందుబాటులో ఉంటే ప్రభుత్వ సర్వీ్‌సలోకి వచ్చేందుకు చాలామంది వైద్యులు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం జీతాలు పెంచకుండా, ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా వైద్యులు రావడం లేదన్న కుంటిసాకులు చెబుతోంది. ఏపీవీవీపీలో మాదిరిగా డీఎంఈలో కూడా జీతంతో పాటు సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్యులకు 20 లేదా 30 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తే ప్రభుత్వ సర్వీ్‌సలోకి రావడానికి వైద్యులు సిద్ధంగా ఉంటారు. డీఎంఈలో న్యూరో సర్జరీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, యురాలజీ విభాగాల్లో మాత్రమే వైద్యుల కొరత ఉంది. ఈ నాలుగు విభాగాల వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇస్తే సరిపోతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇస్తే సరిపోయే దానికి.. వాక్-ఇన్ ఇంటర్వ్యూల పేరుతో ఇతర రాష్ట్రాల వైద్యులకు కూడా ఏపీలో అవకాశం కల్పిస్తున్నారు.
సీనియార్టీ సమస్య...
గతంలోనూ రిమ్స్‌లకు వైద్యులను నియమించుకునే క్రమంలో లోకల్, నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఇతర రాష్ట్రాల వైద్యులకు కూడా పోస్టింగ్‌లు ఇచ్చారు. వారిలో చాలామంది కొన్నేళ్ల పాటు రిమ్స్‌లలో విధులు నిర్వహించారు. గత ప్రభుత్వంలో చాలా మంది వైద్యులు తమను పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా రిమ్స్ వైద్యులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ వైద్యులందరినీ ప్రభుత్వ సర్వీ్‌సలోకి తీసుకొవాల్సి వచ్చింది. అయితే అప్పటికే సర్వీ్‌సలో ఉన్న వైద్యులకు, కొత్తగా వచ్చిన రిమ్స్ వైద్యులకు మధ్య సీనియార్టీ సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో ప్రభుత్వ వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే ఆ సీనియార్టీ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు వాక్-ఇన్ ఇంటర్వ్యూల పేరుతో అలాంటి సమస్యనే మళ్లీ సృష్టించబోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తప్పనిసరి బదిలీలతో తిప్పలు
డీఎంఈ వైద్యుల విషయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు వైద్యుల కొరత తీవ్రమైంది. డీఎంఈలో ఎప్పుడూ రిక్వెస్ట్ బదిలీలు మాత్రమే ఉండేవి. ఇందుకు భిన్నంగా తప్పనిసరి బదిలీలు చేపట్టారు. ఒకే స్టేషన్లో ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో మీడియాలో కథనాలు రావడంతో 30 శాతానికి కుదించారు. అయినా బదిలీల వల్ల ఇటు రోగులు, అటు వైద్యులు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వైద్యులు తమ ప్రమేయం లేకుండానే మరోచోటకు బదిలీ కావాల్సి వచ్చింది. బదిలీ అయిన వైద్యుల్లో దాదాపు 40 శాతం మంది విధుల్లో చేరలేదు. దీంతో అక్కడ వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికి అదే సమస్య కొనసాగుతుంది. బదిలీల ప్రభావం ఇప్పటికీ డీఎంఈలో వైద్య సేవలపై పడుతోంది. మరోవైపు ఇప్పుడు నియామకాల సమయంలో లాంగ్ లీవ్‌లో వెళ్లిన వైద్యుల పోస్టులు మొత్తం ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు డీఎంఈకి సరెండర్ చేస్తున్నారు. దీనిపై లాంగ్ లీవ్‌లో ఉన్న వైద్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. సరెండర్ చేసిన పోస్టులను డీఎంఈ అధికారులు నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వైద్యులు రీ-పోస్టింగ్‌ల కోసం డీఎంఈ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తే వైద్యం చేస్తామని డాక్టర్లు కోరుతున్నారు. అయితే ఉన్నతాధికారులు మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ఈ కారణాలతో డీఎంఈ, ఏపీవీవీపీలో వైద్యుల కొరత తీవ్రమైంది.