సర్కార్‌ ‘మాస్టర్‌ ప్లాన్‌’ సీఆర్‌డీఏతో ఇక చెడుగుడే

ABN , First Publish Date - 2022-12-13T03:12:44+05:30 IST

సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ను తన ఇష్టానుసారంగా మార్చుకునేందుకు తెచ్చిన చట్ట సవరణను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

సర్కార్‌ ‘మాస్టర్‌ ప్లాన్‌’  సీఆర్‌డీఏతో   ఇక చెడుగుడే

మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు తన చేతిలోకి

హైకోర్టు నిలదీతతో గెజిట్‌ జారీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ను తన ఇష్టానుసారంగా మార్చుకునేందుకు తెచ్చిన చట్ట సవరణను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మాస్టర్‌ప్లాన్‌ మార్పులు, చేర్పులు స్థానిక సంస్థలు, వ్యక్తులు ప్రతిపాదనలతో చేయవచ్చుగాని, ప్రభుత్వ తనకు తానుగా మార్చడం కుదరదు. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. తమకు తాముగా మార్పులు, చేర్పులు చేసుకునేలా అసెంబ్లీలో సెప్టెంబరు 21న చట్ట సవరణను చేపట్టింది. గవర్నర్‌ ఆమోదం మేరకు సోమవారం నుంచి ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాజధానిలోని ప్రధాన ప్రాంతమైన ఆర్‌-5 జోన్‌లో తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని ఐదు గ్రామాల్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సర్కార్‌ ఈ సవరణలు చేసిందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమరావతికి భూములిచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇతర జిల్లాల్లో నివశిస్తున్న వారికి కూడా కావాలనే తుళ్లూరు, మంగళగిరిలో స్థలాలివ్వాలని నిర్ణయించడం వెనుక తమను ఇబ్బంది పెట్టేందుకేనని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని అభివృద్ధి కోసం భూములిస్తే... ఆ భూములను ఇతర ప్రాంతాల వారికి ఇంటి స్థలాలుగా ఇస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా తాము భూములిచ్చింది రాజధాని అభివృద్ధి కోసమేనని, బలహీనవర్గాల ఇళ్ల కోసం కాదని హైకోర్టులో రైతులు తమ వాదనను వినిపిస్తున్నారు.

పరిశ్రమలు, సంస్థలు రావడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు కేటాయించిన స్థలాలు ధరలు పెరిగి తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని రైతులు భావించారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని గుర్తించకుండా ఏ క్షణంలోనైనా రాజధానిని వైజాగ్‌కు తరలిస్తామని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారికి అమరావతిలో స్థలాలు ఇవ్వడం వెనుక చంద్రబాబు తలపెట్టిన రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రభుత్వం కూడా అసెంబ్లీ చట్ట సవరణ ద్వారా రాజధాని ప్రాంతాన్ని, మాస్టర్‌ ప్లాన్‌ను ఎన్ని రకాలుగా అయినా మార్చుకునేలా చట్ట సవరణ చేసింది. పైగా హైకోర్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతేనని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని స్పష్టం చేసింది. అయితే తాజాగా మళ్లీ వైజాగ్‌ను కార్యనిర్వాహణ రాజధానిగా చేస్తామని మంత్రులు చెబుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేసులు వేశారు. సుప్రీంకోర్టులో ఏమీ తేలకుండానే రెండు మూడు నెలల్లో వైజాగ్‌కు రాజధాని తరలిస్తామని చెబుతూ ప్రజల్లో అయోమయం రేకెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో చేసిన చట్ట సవరణను ఇప్పుడు తెరపైకి తెచ్చి సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి ఇళ్ల పట్టాలివ్వడంలో చిత్తశుద్ధి లేదని, జనాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికే ఈ వ్యూహాలు అమలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-12-13T03:12:44+05:30 IST

Read more