గ్రామకంఠం భూములకు యాజమాన్య హక్కులు
ABN , First Publish Date - 2022-04-05T10:04:28+05:30 IST
గ్రామకంఠం పరిధిలోని భూములకు రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టం కింద యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిబంధనలను జారీచేసింది. నిజానికి నిరుడు డిసెంబరు 21నే గ్రామకంఠం భూముల హక్కుల రూల్స్‌ను విడుదల చేస్తూ..
రూల్స్‌పై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
సూచనలు, అభ్యంతరాలకు 12 రోజుల సమయం
అమరావతి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): గ్రామకంఠం పరిధిలోని భూములకు రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టం కింద యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిబంధనలను జారీచేసింది. నిజానికి నిరుడు డిసెంబరు 21నే గ్రామకంఠం భూముల హక్కుల రూల్స్‌ను విడుదల చేస్తూ రెవెన్యూశాఖ జీవో 366ని జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు ఆర్‌వోఆర్ చట్టంతోపాటు, ఇతర కీలక చట్టాల్లోని సెక్షన్లను తోసిరాజనేలా ఉన్నాయని, వాటిని మార్చాలని అడ్వకేట్ జనరల్ సూచించినట్లు తెలిసింది. దీంతో జీవో 366ను నిలుపుదల చేశారు. ఇప్పుడు ఇదే అంశంపై సమీక్ష జరిపి కొత్తగా రూల్స్‌ను ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు (జీవో 208) జారీచేశారు. ఈ రూల్స్‌పై సూచనలు, అభ్యంతరాలు తెలియజేసేందుకు 12 రోజులు సమయం ఇచ్చారు. ఆ తర్వాత తుది రూల్స్ విడుదల చేస్తారు. భూమిపై హక్కులు కోరే వారు కనీసం 12 ఏళ్లపాటు ఆ భూమిపై పొజిషన్ కలిగి ఉండాలని చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 12 ఏళ్ల పొజిషన్ నిర్ధారణకు గ్రామంలో విచారణ చేపట్టాలని రూల్స్‌లో పేర్కొన్నారు. అయితే ఎలాంటి డాక్యుమెంట్ లేనిపక్షంలో క్లెయిమ్ చేస్తున్న వ్యక్తికి ఇరుగుపొరుగున ఉన్నవారిని విచారించడం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, విద్యుత్ బిల్లుతోపాటు ఇతర డాక్యుమెంట్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే క్లెయిమ్ నిజమైనదేనని తహశీల్దార్ ఖరారు చేసి భూమిపై హక్కులు కల్పిస్తారు. గ్రామకంఠం భూములపై గ్రామాలవారీగా రెండు రకాల రిజిస్టర్లు నిర్వహించనున్నారు. ఒకటి గ్రామకంఠం భూములు(జీకే1), రెండోది వ్యక్తిగత గ్రామకంఠం భూములు (జీకే-11). ఆర్‌వోఆర్ చట్టంలోని సెక్షన్ 2(1-జీ) కింద హక్కులు ఇవ్వనున్నారు. ఇవి రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 17(బి) కింద చెల్లుబాటవుతాయి. గ్రామకంఠం భూములపై హక్కులు కోరుతూ వచ్చే దరఖాస్తులపై డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) విచారణ జరుపుతారు. నివేదిక ఆధారంగా తహశీల్దార్ నిర్ణయం తీసుకుంటారు. హక్కుల రికార్డులను ఖరారు చేశాక వాటిని గ్రామసచివాలయంలో, పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని రూల్స్‌లో పేర్కొన్నారు. తుది రికార్డులను ఖరారు చేశాక వాటిపై గ్రామసభలు నిర్వహించాలి. అప్పటికి వచ్చే వినతులు, అభ్యంతరాలను రికార్డు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. వ్యక్తిగత గ్రామకంఠం భూములపై తహశీల్దార్ ఇచ్చే ఆదేశాలపై ఆర్‌డీవో వద్ద అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.