Gorantla Madhav: ఇక ఈ రాద్ధాంతానికి పుల్‌స్టాప్‌ పెట్టాలి: ఎంపీ గోరంట్ల

ABN , First Publish Date - 2022-08-10T23:36:05+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) నగ్న వీడియో ఒరిజనల్

Gorantla Madhav: ఇక ఈ రాద్ధాంతానికి పుల్‌స్టాప్‌ పెట్టాలి: ఎంపీ గోరంట్ల

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) నగ్న వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యల నేపథ్యంలో మాధవ్ స్పందించారు. కొంతమంది దుర్మార్గులు కావాలనే ఇలా చేశారని, వీడియోని మార్ఫింగ్‌ చేశారని తాను ఆ రోజే చెప్పానని ఎంపీ అన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టటానికే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఈ రాద్ధాంతానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. నకిలీ వీడియో సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని గోరంట్ల మాధవ్ తెలిపారు. 


అంతకుముందు మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. వీడియోను మార్ఫింగ్‌ (Morphing) లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోని మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. వీడియోను మొదట iTDP official అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్‌ చేశారని తెలిపారు. ఈ నెల 4 అర్ధరాత్రి 2.07 గంటలకు +447443703968 నెంబర్‌ నుంచి పోస్ట్‌ చేసినట్లు చెప్పారు.


అయితే ఎస్పీ వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. అది ఫేక్ వీడియో అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు. వీడియో ఫేక్ అని ఏ ఫోరెన్సిక్ నివేదిక తెలిపిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో చూపించాలని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు గోడల మధ్య జరిగింది అన్నారని... ఎస్పీ అసలు వీడియో గోరంట్లదే కాదు అని చెబుతున్నారని లోకేష్ గుర్తుచేశారు. అయినా వీడియోపై ఎస్పీ అలా ఎలా ప్రకటిస్తారని, ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా... అని ప్రశ్నించారు. ఓ సిస్టమ్, ప్రొసిజర్ అంటూ ఉంటుంది కదా అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఐదు రోజుల తర్వాత ఫేక్ అని చెప్పడం హాస్యాస్పదం అని, మంత్రి అంబటి రాంబాబు రాసలీలలు కూడా ఫేక్ అంటారా అని లోకేష్ సందేహం వ్యక్తం చేశారు.




Updated Date - 2022-08-10T23:36:05+05:30 IST