డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి

ABN , First Publish Date - 2022-12-16T02:08:53+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే పవర్‌ కెనాల్‌కు బుధవారం అర్ధరాత్రి గండి పడింది.

డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి

పొల్లూరు, డొంకరాయిల్లో 485 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేత

నేడు గండి పూడ్చివేత పనులు!

సీలేరు, డిసెంబరు 15: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే పవర్‌ కెనాల్‌కు బుధవారం అర్ధరాత్రి గండి పడింది. దీంతో పొల్లూరులో 460 మెగావాట్లు, డొంకరాయిలో 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. గురువారం సాయంత్రం వరకు గండి పూడ్చివేత పనులు ప్రారంభించలేదు. జిల్లాలోని మోతుగూడెం సమీప పొల్లూరులో 460 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్‌ కేంద్రం ఉంది. దీనికి ఎగువనున్న డొంకరాయిలో 25 మెగావాట్ల విద్యుతుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీటితోపాటు డొంకరాయి జలాశయం నుంచి మరింత నీటిని కాలువ (పవర్‌ కెనాల్‌) ద్వారా పొల్లూరుకు సరఫరా చేస్తుంటారు. కాలువ గరిష్ఠ నీటి సరఫరా సామర్థ్యం 4,300 క్యూసెక్కులు. కాగా బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో డొంకరాయికి ఆరు కిలోమీటర్ల దూరంలోని పికప్‌ డ్యామ్‌ సమీపంలో గంగువాడ యూటీ వద్ద పవర్‌ కెనాల్‌కు గండి పడింది.

పొల్లూరు పవర్‌ ప్లాంట్‌కు సమీపంలోని ఫోర్‌ బే డ్యామ్‌లో నీటి మట్టం తగ్గుతుండడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే జెన్‌కో అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కాలువను పరిశీలిస్తూ వెళ్లగా పికప్‌ డ్యామ్‌ సమీపంలో గండి కనిపించింది. వెంటనే డొంకరాయి డ్యామ్‌ అధికారులకు సమాచారం అందించి నీటి విడుదలను నిలుపుదల చేయించారు. పొల్లూరు, డొంకరాయిల్లో విద్యుదుత్పత్తి ఆపేశారు. ఏపీ జెన్‌కో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారులు విజయవాడ నుంచి గురువారం సాయంత్రం ఇక్కడకు చేరుకుని గండిని పరిశీలించారు. శుక్రవారం నుంచి గండి పూడ్చివేత పనులు చేపడతామని వెల్లడించారు.

Updated Date - 2022-12-16T02:08:54+05:30 IST