స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణరాజు మృతి
ABN , First Publish Date - 2022-08-18T10:11:33+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కృష్ణా, గోదావరి డెల్టా పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు (93) బుధవారం కన్నుమూశారు.

కాళ్ళ, ఆగస్టు 17: పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కృష్ణా, గోదావరి డెల్టా పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు (93) బుధవారం కన్నుమూశారు. రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సూర్యనారాయణరాజు భార్య సుభద్రమ్మ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. సూర్యనారాయణరాజుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సూర్యనారాయణరాజు పదమూడో ఏట ఎస్ఎ్సఎల్సీ చదివే రోజుల్లోనే అంటే 1941లో వ్యష్టి, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోషలిస్టు పార్టీ యువజన సంఘాల నాయకుడిగా పనిచేశారు. సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కరివెనలో జరిగిన రైతు సత్యాగ్రహంలో పాల్గొనడంతోపాటు అరెస్టయ్యారు.