అనుమతి లేని వైద్యకళాశాలకు శంకుస్థాపనా?

ABN , First Publish Date - 2022-12-31T05:59:43+05:30 IST

అనకాపల్లి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన ఎలా చేశారని తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ‘

అనుమతి లేని వైద్యకళాశాలకు శంకుస్థాపనా?

ఇది ప్రజలను మోసం చేయడం కాదా?: అయ్యన్నపాత్రుడు

టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు గర్హనీయం..

కలెక్టర్‌, ఎస్పీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన ఎలా చేశారని తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ‘‘పాడేరుతో కలిపి మూడు వైద్య కళాశాలలకే కేంద్రం అనుమతి ఇచ్చింది. అందులో అనకాపల్లి మెడికల్‌ కాలేజీ లేదు. అయినా, మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా అనుమతి లేని కళాశాలకు శంకుస్థాపన చేయడం...ప్రజలను మోసం చేయడం కాదా?’’ అని ఆయన మండిపడ్డారు. గద్దెనెక్కినప్పటి నుంచి ప్రతిరోజూ ప్రజలను మోసం చేస్తున్న సీఎం, ఇంకెంత కాలం తప్పుడు విధానాలు, అబద్ధాలతో మోసం చేస్తారని ధ్వజమెత్తారు. ఒక వైద్య కళాశాలకు భవనాలు నిర్మించిన తరువాత కార్యకలాపాలు ప్రారంభించాలంటే రూ.600 కోట్లు కావాలన్నారు. రోడ్లపై గోతులు పూడ్చడానికే సొమ్ములు లేనపుడు ఒక కళాశాలకు రూ.600 కోట్లు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. వైద్య కళాశాలలపై జగన్‌ తొలి నుంచీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ‘‘మొత్తం 16 కళాశాలలకు రెండున్నరేళ్ల క్రితమే సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడు కళాశాలలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అందులో మూడింటికే అనుమతి లభించింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం...మరో 12 మెడికల్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని కోరడం ప్రజలను మోసం చేయడం కాదా?’’ అని ప్రశ్నించారు. వైద్య కళాశాల శంకుస్థాపనకు జగన్మోహనరెడ్డి వస్తున్నారని వారం రోజుల నుంచి నర్సీపట్నంలో వ్యాపారాలు లేవని, పట్టణంలో గోతులు తవ్వి బారికేడ్లు పెట్టి పరదాలు కట్టారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు రుణాలు చెల్లించవద్దని 2019 ఎన్నికల సమయంలో చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, నర్సీపట్నంలో 80 శాతం పనులు పూర్తయిన ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారన్నారు. సీఎం సభను అడ్డుకుంటారన్న అనుమానంతో నర్సీపట్నంలో నాయకులను గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం అన్యాయమని, దీనికిగాను కలెక్టర్‌, ఎస్పీలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే నర్సీపట్నంలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తామని అయ్యన్న హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆ పార్టీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T05:59:45+05:30 IST