-
-
Home » Andhra Pradesh » Failed in ten two committed suicide-NGTS-AndhraPradesh
-
పదిలో ఫెయిలయ్యామని..ముగ్గురి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-07T09:21:39+05:30 IST
పదో తరగతి పరీక్ష ఫలితాలు మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి.

శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలు
చెన్నేకొత్తపల్లి, పామిడి, ములకలచెరువు, జూన్ 6: పదో తరగతి పరీక్ష ఫలితాలు మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. సోమవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, మృతుల బంధువుల తెలిపిన కథనాల మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన నాగమ్మ, హనుమంతు దంపతుల కుమార్తె వెన్నెల (15) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. సోమవారం ఫలితాలు వెల్లడి కాగా.. వెన్నెల ఫెయిలైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం బెంగళూరుకు, అన్న మెకానిక్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన అన్న ఎంత పిలిచినా వెన్నెల తలుపు తీయకపోవడంతో.. కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విష గుళికలు మింగి...
అనంతపురం జిల్లా పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన విద్యార్థిని శిరీష (15) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన సుధాకర్ పెద్ద కుమార్తె శిరీష ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆమె ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో విషపు గులికలు మింగింది. బాత్‌రూమ్‌లో వాంతులు చేసుకుంటున్న శిరీషను కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
రైలు కింద పడి ఆత్మహత్య
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. ములకలచెరువు మండలం కుటాగులపల్లెకు చెందిన కుటాగులపల్లె నాగరాజు, వెంకటలక్ష్మమ్మలకు ఇద్దరు సంతానం. కుమార్తె ప్రభావతి ఇంటర్మీడియట్ చదువుతోంది. కుమారుడు ప్రశాంత్‌కుమార్ చిన్నప్పటి నుంచి శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులోని తన అత్త శ్యామలమ్మ వద్ద ఉంటూ అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల అనంతరం స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లో గణితం, సోషల్‌లో సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.