1 నుంచి ముఖ హాజరు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-31T09:18:28+05:30 IST

బోధన, బోధనేతర ఉద్యోగులందరూ సెప్టెంబరు 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ముఖ హాజరు విధానంలోనే హాజరు నమోదు చేయాలని

1 నుంచి ముఖ హాజరు తప్పనిసరి

ఫోన్‌ లేకపోతే... హెచ్‌ఎం ఫోన్‌లో వేయండి

ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

డివై్‌సలు కోరుతున్న ఉపాధ్యాయ సంఘాలు

చర్చల్లో ఏమీ తేల్చకుండానే అమలుకు మళ్లీ సన్నాహాలు


అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): బోధన, బోధనేతర ఉద్యోగులందరూ సెప్టెంబరు 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ముఖ హాజరు విధానంలోనే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. బుధవారం నాటికి ప్రతి ఒక్కరూ ఫేసియల్‌ అంటెడెన్స్‌ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఉపాధ్యాయులతోపాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్రస్థాయి కార్యాలయాలు, ఆర్జేడీ కార్యాలయాలు, డీఈవో, ఎంఈవో కార్యాలయాలతోసహా అన్నిటికీ ఈ విధానం తప్పనిసరి అని పేర్కొంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సురేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేని టీచర్లు, ఉద్యోగులు పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు లేదా ఇతర ఉపాధ్యాయుల ఫోన్లలో హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అంధులకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుందని, వారి కోసం విడిగా రిజిస్టర్‌ నిర్వహించాలని ఆదేశించారు.


పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా తప్పనిసరిగా దీనిని అమలుచేయాలని, మాన్యువల్‌ హాజరు విధానం అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా దీనిపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత కొనసాగుతోంది. ముఖ హాజరు వేసేందుకు డివై్‌సలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం డివై్‌సలు ఇస్తే ముఖ హాజరు విధానాన్ని అమలుచేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఈనెలాఖరు వరకు దానిని ఉపయోగించాలని, అప్పటికీ ఇబ్బందులుంటే మరోసారి సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం డివై్‌సలు ఇస్తేనే హాజరు వేస్తామని సంఘాలు మంత్రికి తేల్చి చెప్పాయి. దీంతో అప్పటి చర్చలు అసంపూర్ణంగానే ముగిశాయి.


అనంతరం ముఖ హాజరుకు 10 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ను తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఆఫ్‌లైన్‌ విధానంలోనూ హాజరు వేయాలని, ఈనెల 31 వరకు పైలెట్‌ ప్రాజెక్టుగా కొనసాగుతుందని తెలిపింది. ఇప్పటికీ ప్రభుత్వమే డివై్‌సలు ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. యాప్‌ను వినియోగించకూడదని సంఘాలు భావిస్తున్నాయి. అవసరమైతే హాజరుతోపాటు ఇతర యాప్‌లు కూడా వాడకుండా నిరసన తెలపాలనే ఆలోచనలో ఉన్నాయి.

Read more