బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ABN , First Publish Date - 2022-08-08T08:02:07+05:30 IST

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

రేపటికి వాయుగుండంగా మారే చాన్స్‌

ఉత్తర కోస్తా, తెలంగాణకు భారీ వర్షసూచన

ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టాలకు కూడా

నాలుగు రోజులు సముద్రంలోకి వెళ్లొద్దు

మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక


విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో శనివారం రాత్రి అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారి.. దక్షిణ ఒడిసా, ఉత్తరకోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్యంగా పయనించి ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా వెళ్లనుంది. దీని ప్రభావంతో ఒడిసాలో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, ఉత్తరకోస్తాలో విస్తారంగా, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెలంగాణలో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడ అత్యంత భారీ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో అనేకచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమ, దక్షిణకోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఇదే సమయంలో రాయలసీమలో ఈదురుగాలులు వీస్తామని వాతావరణశాఖ తెలిపింది. ఆ తరువాత రెండురోజులు ఉత్తరకోస్తా, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ, విదర్భ, మరట్వాడా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రానున్న నాలుగు రోజుల వరకు కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. కాగా,  మత్స్యకారులు రెండు రోజులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్‌ కోరారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2022-08-08T08:02:07+05:30 IST