శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-25T09:43:30+05:30 IST

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయంలోనే ఏకాంతంగా జరిగిన వాహన సేవలు ఈసారి భక్తుల మధ్య జరగనున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

రేపు అంకురార్పణ.. ఎల్లుండి ధ్వజారోహణం

రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య వాహనసేవలు


తిరుమల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయంలోనే ఏకాంతంగా జరిగిన వాహన సేవలు ఈసారి భక్తుల మధ్య జరగనున్నాయి. 2020 మార్చి నెలలో కరోనా వైరస్‌ వ్యాప్తి భారీగా పెరిగిన క్రమంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆ ఏడాది మార్చి 21 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలను పూర్తిస్థాయిలో రద్దుచేశారు. ఆ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించినప్పటికీ 2020 సెప్టెంబరు 19 నుంచి 27 వరకు వార్షిక, అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను (అధికమాసం సందర్భంగా) ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 2021లో కూడా కొవిడ్‌ ప్రభావం తగ్గకపోవడంతో అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను మళ్లీ ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొవిడ్‌ దాదాపుగా తగ్గిన క్రమంలో ఎట్టకేలకు తిరిగి శ్రీవారు వివిధ వాహనాలపై కొలువుదీరి మాడవీధుల్లో ఉండే భక్తకోటికి దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.


ఇందులో భాగంగా, బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది. మంగళవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు పగలు, రాత్రి వివిఽధ వాహనాలపై స్వామివారు విహరిస్తూ భక్తకోటిని కటాక్షిస్తారు. రెండేళ్ల తర్వాత వాహనసేవలను వీక్షించే భాగ్యం కలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశముంది. పైగా, పవిత్ర పెరటాశి మాసం జతకావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. భక్తుల రద్దీని అంచనా వేస్తూ టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు.

Read more