ఆస్తి కోసం కొట్టుకుంటోందెవరో అందరికీ తెలుసు

ABN , First Publish Date - 2022-08-04T09:03:57+05:30 IST

ఆస్తి కోసం కొట్టుకుంటోందెవరో అందరికీ తెలుసు

ఆస్తి కోసం కొట్టుకుంటోందెవరో అందరికీ తెలుసు

ఎన్టీఆర్‌ కుటుంబంపై రాద్ధాంతమెందుకు?

వైసీపీకి ఒక్కసీటు కూడా రాదు: రఘురామ 

న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి) ‘‘ఆస్తి కోసం ఏ అన్నాచెల్లెలు కొట్టుకు చస్తున్నారో తెలుగు రాష్ర్టాల్లో ప్రజలందరికీ తెలుసు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఆత్మహత్యపై వైసీపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ పేరిట చిలువలు, పలువలుగా రాయడం దారుణమని మండిపడ్డారు. సర్వే నెంబర్లను సృష్టించి, అబద్ధమని తెలిసిన తర్వాత తృణ ప్రాయమైన ఆస్తికోసం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు తగాదాపడ్డారని పేర్కొంటూ.. శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారిక వెబ్‌ సైట్‌లో, చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ పేరిట ఈ తరహా పిచ్చి రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు ‘బాబాయి’ అనే ఫీలింగ్‌ లేదని, అందరూ ఆయనలాగా ఉండరు కదా? అని ఎద్దేవా చేశారు. బాబాయి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలను చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై.. గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి చేత ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారని చెప్పారు. రామ్‌ సింగ్‌ తనపై పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను స్క్వాష్‌ చేయాలని కోరితే, కోర్టులో కేసు లిస్ట్‌ కాలేదని, జడ్జి సెలవు పెట్టి వెళ్లారని, ఈ వరుస పరిణామాలు చూేస్త ఒళ్లు జలదరిస్తోందని అన్నారు. కాగా, రాజ్యసభలో తమ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు చూస్తే లేపి తన్నించుకోవడం అంటే ఇదే కాబోలు అనిపిస్తుందని రఘురామ అన్నారు. ఏపీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ పేరిట తాము చేసిన అప్పులు తప్పా?, అప్పులను తప్పు పట్టినట్టుగా ఆర్‌బీఐ లేఖ రాసిందా? అంటూ  విజయసాయిరెడ్డి ప్రశ్నించారని తెలిపారు. అయితే.. అది తప్పేనని ఆర్‌బీఐ లేఖ రాసినట్లు పార్లమెంటులో వెల్లడించారని తెలిపారు. పార్లమెంట్‌లోనే తప్పు చేశారని చెప్పిన తర్వాత సీఎం జగన్‌, బ్యాంకర్లపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.   


Updated Date - 2022-08-04T09:03:57+05:30 IST