Jagananna Housing SCHME: పట్నాల్లో ప్రతి ఇల్లూ కొలవండి!

ABN , First Publish Date - 2022-12-16T02:46:40+05:30 IST

ప్పుడో ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మించుకున్న పేదల ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ అంటూ నిన్నటివరకు వేధించిన సర్కారు, ఇప్పుడు మరో పిడుగును పట్టణ ప్రజలపై వేసింది.

Jagananna  Housing SCHME: పట్నాల్లో ప్రతి ఇల్లూ   కొలవండి!

ప్రభుత్వ స్థలముంటే వెనక్కి తీసుకోవాలి.. పట్టణ ప్రజలపై సర్కారు మరో పిడుగు

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పేరిట

మళ్లీ పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం

టెలీకాన్ఫరెన్స్‌ పెట్టి అధికారులపై ఒత్తిడి

ఖాళీ స్థలాలను డ్రోన్‌తో సర్వే చేయించండి

వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్‌

రిజిస్టర్డు స్థలాలకు మళ్లీ కొలతలేంటి?

కొలతలకు వచ్చేవారిపై ప్రజల ఆగ్రహావేశాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎప్పుడో ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మించుకున్న పేదల ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ అంటూ నిన్నటివరకు వేధించిన సర్కారు, ఇప్పుడు మరో పిడుగును పట్టణ ప్రజలపై వేసింది. పట్టణాల్లోని ప్రతి ఇంటి స్థలాన్ని, ప్రతి ఖాళీ స్థలాన్ని కొలవడానికి సిద్ధమైంది. ‘అక్రమం’ అని తేలితే వెనక్కి తీసేసుకునేందుకు రంగంలోకి దిగింది. దీనికోసం పట్టణ ఆవాసాలను రీసర్వే చేయాలని వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రతి రోజూ ఎన్ని ఇళ్లు సర్వే చేశారంటూ వారికి ఉన్నతాధికారులు టార్గెట్లు పెట్టి పరుగులు తీయిస్తున్నారు. ప్రతి ఇంటి స్థలాన్ని సర్వే చేయడంద్వారా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే.. ఎప్పుడో రిజిస్టరు అయిన తమ భూములను ఇప్పుడు కొత్తగా కొలవడం ఏమిటని పట్టణవాసులు.. కొలతలకు వస్తున్న ఉద్యోగులపై మండిపడుతున్నారు. పట్టణాల్లో తమ ఆస్తులు తమకు దక్కాలంటే వైసీపీ నేతల అండదండలు ఉండాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారా అని మరికొందరు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్వమిత్వ, జగనన్న శాశ్వత భూహక్కు పథకం పేరిట ప్రైవేట్‌ ఆస్తులకు సంబంధించి ఇచ్చే పాస్‌బుక్‌లపై జగన్‌ బొమ్మ ముద్రించి ఇస్తున్నారు. అదే రీతిలో ఇప్పుడు పట్టణవాసులకు చెందిన ఆస్తి హక్కులపత్రంపై కూడా జగనన్న బొమ్మ వేసి ఇవ్వడానికి చేస్తున్న హడావుడిలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సర్వేకు బృందాలు ఏర్పాటు...

ప్రతి వార్డు సచివాలయంలో పనిచేసే అడ్మిన్‌, ప్లానింగ్‌ సెక్రటరీ, అమెనిటీస్‌ సెక్రటరీ, వీఆర్వోలతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఉద్యోగి ఆయా వార్డుకు సంబంధించి కొన్ని ఇళ్లను సర్వే చేయాలని టార్గెట్లు పెట్టారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆయా కుటుంబ యజమానికి సంబంధించిన ఇంటి స్థలం, ఖాళీ స్థలం కొలుస్తారు. ఇందుకోసం ప్రామాణికంగా రీసర్వే రిజిస్టర్‌, టౌన్‌ప్లానింగ్‌ రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచుకుంటారు. ఎక్కడైనా ఆయా ఇంటి యజమానులు మున్సిపల్‌ స్థలం ఆక్రమించి ఉంటే దానిని గుర్తిస్తారు. నాలాలు, ఇతర ఆక్రమణలు ఏవైనా ఉంటే వాటిని తెలుసుకుంటారు. ప్రతి రోజు ఆయా ఉద్యోగులు కొన్ని ఇళ్లకు తిరిగి వాటి కొలతలు తీయాల్సి ఉంటుంది. వాస్తవంగా ఇంటి యజమానికి చెందిన అసలైన ఆస్తికి సంబంధించి ప్రత్యేకంగా హక్కులు కల్పించనున్నారు. అంటే మున్సిపల్‌ స్థలం గాని, ఇతరుల స్థలం గాని ఆక్రమణకు గురై ఉంటే అలాంటి హక్కులు వారికి దక్కవు. ఈ సర్వే నిర్వహించడం ద్వారా పట్టణ ప్రజలు పన్నులు చెల్లింపులు కూడా కచ్చితంగా వస్తాయని, ఆయా పట్టణ స్థానికసంస్థలకు ఆదాయం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రీసర్వే పూర్తి కాగానే..ప్రత్యేకంగా ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహహక్కు పేరుతో పత్రాల్ని ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రతి రోజు వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చి మరీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదేం సర్వే?...

పట్టణాల్లో ఇంటిని కొలవడానికి వచ్చిన వార్డు సిబ్బందిపై పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల దాడులకు కూడా దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక ఉన్నతాధికారులకు వారు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వలేకపోతున్నారు. ఎప్పటి నుంచో ఇతరుల నుంచి కొనుగోలుచేసిన ఆస్తికి తాము రిజిస్టర్‌ ఆఫీస్‌ ద్వారా హక్కులు పొందామని, ఇప్పుడు మళ్లీ మా ఆస్తిని కొలిచి హక్కుపత్రాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లన్నీ తప్పుడవని ప్రభుత్వం భావిస్తుందా? లేక ప్రజలందరూ ఆక్రమణదారులుగా తేల్చుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వార్డు సచివాలయ ఉద్యోగులు కుటుంబాల వద్దకు వెళ్లి ఽధైర్యంగా కొలవలేని స్థితిలో పడ్డారు. ఓ వైపు ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతో ఏవో కొన్ని ఇళ్లు సర్వే చేశామని గాలి లెక్కలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటి గ్రామాల్లో స్వమిత్వ, జగనన్న శాశ్వత భూహక్కు పథకం పేరిట ప్రైవేట్‌ ఆస్తులకు సంబంధించి ఇచ్చే పాస్‌బుక్‌లపై జగన్‌ బొమ్మ ముద్రించి ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి ఆస్తి హక్కులపై జగన్‌ ఫొటోలు ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అదే రీతిలో ఇప్పుడు పట్టణ వాసులకు చెందిన ఆస్తి హక్కులపత్రంపై కూడా జగన్న బొమ్మ వేసి ఇవ్వాలని భావిస్తున్నట్లుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పట్టణాల్లో వైసీపీ నేతలు వార్డు సచివాలయ సిబ్బందిని గుప్పిట్లో పెట్టుకుని ఆయా కుటుంబాలతో మమేకమయ్యేందుకు ప్రభు త్వం ఇలాంటి పథకాలను ముందుకు తెస్తున్నదని కొందరు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-12-16T02:46:41+05:30 IST