ఇస్తామంటే.. వద్దంటారే!

ABN , First Publish Date - 2022-02-23T08:09:56+05:30 IST

ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం ప్రతి 1000 మంది కార్మికులున్న చోట ఒక డిస్పెన్సరీ ఏర్పా టు చేయాలి. 50 వేల మంది బీమాదారులు ఉన్న ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలి. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న 4 ..

ఇస్తామంటే.. వద్దంటారే!

  • ’ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
  • 7 ఆస్పత్రులకు కేంద్రం అనుమతి.. నిర్మాణానికి 700 కోట్లు కేటాయింపు
  • 3 ఏళ్లు నిర్వహణ ఖర్చులూ కేంద్రానివే.. స్థలాలు ఇస్తే నిర్మించి ఇస్తామని లేఖలు
  • పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. రద్దయ్యే దుస్థితి.. 16 డిస్పెన్సరీలూ అంతే



(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం ప్రతి 1000 మంది కార్మికులున్న చోట ఒక డిస్పెన్సరీ ఏర్పా టు చేయాలి. 50 వేల మంది బీమాదారులు ఉన్న ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలి. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న 4 ఆస్పత్రులతో పాటు కేంద్ర కార్మిక శాఖ మరో ఏడు ఆస్పత్రులకు, 16 డిస్పెన్సరీల ఏర్పాటుకు అనుమతిచ్చింది. విజయనగరం, అచ్యుతాపురం(విశాఖ), కాకినాడ, గుంటూరు, హిందూపురం, పెనుగొండ, శ్రీసిటిల సమీపంలో వంద పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు 2018లోనే కేంద్రం అనుమతి ఇచ్చిం ది. వీటి నిర్మాణానికి రాష్ట్రం భూమి కేటాయించాలి. విజయనగరంలో మినహా మరెక్కడా భూమి కేటాయించలేదు. విజయనగరంలో మూడేళ్ల క్రితం భూమి కేటాయించిన రాష్ట్రం, ఏడాది క్రితం వెనక్కి తీసుకుంది.


ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి ఇచ్చిన స్థలంలోనే కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపడుతోంది. కాకినాడలో మాత్రం ఈఎ్‌సఐకి సొంత స్థలం ఉంది. ఆస్పత్రుల నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తే నెలల వ్యవధిలోనే నిర్మాణం చేపడతామని కేంద్రం లేఖలు రాస్తోంది. 3 ఏళ్ల పాటు నిర్వహణ ఖర్చులు భరిస్తామని పేర్కొంది. కానీ రాష్ట్రం మాత్రం స్పందించడం లేదు. దీంతో అనుమతులు రద్దు చేయడంతో పాటు కేంద్రం పరిధిలోని ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ కేటాయించిన రూ.700 కోట్ల నిధులు వెనక్కి పోయే పరిస్థితి వచ్చింది. 


ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌ అధికారుల నిర్లక్ష్యం

ఆస్పత్రుల నిర్మాణం ఆలస్యానికి ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం. కార్మికుల సౌకర్యార్థం కేంద్రం ఏడు వందల పడకల ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతిస్తే... డైరెక్టరేట్‌ అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం  చేసుకుని స్థలాలు కేటాయించడానికి అధికారులు ప్రయత్నాలు చేయాలి. కానీ అధికారుల దృష్టి ఎప్పు డూ ముడుపులపైనే ఉందనే విమర్శలు వస్తున్నాయి. 


నెలనెలా అద్దె.. తెరుచుకోని డిస్పెన్సరీలు

ఏడు ఆస్పత్రులతో పాటు 2018లో ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ కొత్తగా 16 డిస్పెన్సరీలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఫర్నీచర్‌, మందులు, ఇతర మౌలిక సదుపాయాలతో సహా భవన నిర్మాణానికి 2 కోట్లు వెచ్చిస్తుం ది. ఈఎ్‌సఐ ఆస్పత్రుల మాదిరే వీటికీ మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు భరిస్తుంది. కేవలం సిబ్బందిని మాత్రమే రాష్ట్రం నియమించుకోవాలి. డిస్పెన్సరీల ఏర్పాటుకు 2018 అక్టోబరులో రాష్ట్రం జీవో విడుదల చేసింది. వాటికి అద్దె భవనాలు చూశారు. ప్రతి డిస్పెన్సరీకి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ అద్దెలు చెల్లిస్తున్నారు. కానీ వాటి ద్వారా రోగులకు వైద్య సేవలు మాత్రం అందించడం లేదు. కంచికచర్ల, ఎచ్చెర్ల, అప్పన్నవీడుతో పాటు మరో డిస్పెన్సరీలో మాత్రం కార్మికులకు వైద్యం అందిస్తున్నారు.  డిస్పెన్సరీలలో సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప టి వరకూ దృష్టి పెట్టలేదు. దీంతో మొత్తం డిస్పెన్సరీలు రద్దు చేసే ఆలోచనలో ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ ఉత్తిపుణ్యానికి 12 డిస్పెన్సరీలకు అద్దెలు చెల్లిస్తోంది. మరోవైపు డైరెక్టరేట్‌లో ప్లానింగ్‌ విభాగాన్ని నీరుగార్చారు. దీనిద్వారానే కొత్త ఆస్పత్రులు, డిస్పెన్సరీలపై ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలి.


నియామకాల్లో గందరగోళం 

గత ఏడాది ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌ అధికారులు ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ కలిపి 92 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మెరిట్‌ లిస్ట్‌ కూడా సిద్ధం చేశారు. ఇదంతా ఓ కీలక అధికారి కనుసన్నల్లో జరిగింది. పోస్టింగ్‌ అర్డర్లు ఇచ్చే సమయంలో టాప్‌లో ఉన్న ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.600 చెల్లించలేదని వారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. సదరు అభ్యర్థులు దీనిపై సీఎంవోకు ఫిర్యాదు చేశారు. దీంతో డైరెక్టరేట్‌ అధికారులు ఫైల్‌ను సచివాలయంలోని ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపించేశారు. కొన్నేళ్లుగా ఆ ఫైల్‌ అక్కడే ఉండిపోయింది. ఈ నియామకాల ప్రక్రియలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-02-23T08:09:56+05:30 IST