అనంత జలహాసం

ABN , First Publish Date - 2022-09-10T08:38:15+05:30 IST

‘అదే పెన్న! అదే పెన్న..! నిదానించి నడు! విదారించు నెదన్‌, ఒట్టి ఎడారి తమ్ముడు!

అనంత జలహాసం

  • కరువు సీమలో గంగమ్మ ఉరకలు 
  • ఇసుక ఎడారి పెన్నాలో నీటి పరవళ్లు 
  • దశాబ్దాల తర్వాత నిండిన జలాశయాలు 


అనంతపురం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘అదే పెన్న! అదే పెన్న..! నిదానించి నడు! విదారించు నెదన్‌, ఒట్టి ఎడారి తమ్ముడు!’.... ఇదీ పెన్నా నది దుస్థితి గురించి విద్వాన్‌ విశ్వం రాసిన ‘పెన్నేటి పాట’. కానీ ప్రస్తుతం ఇసుక ఎడారి పెన్నలో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కరువు సీమలో వరద ప్రవాహం బిరబిరా పారడంతో దశాబ్దాల తరువాత పెన్నా నదిపై రిజర్వాయర్లు నిండాయి. చిలుం పట్టిన గేట్లను శుద్ధి చేస్తూ నీరు దిగువకు జాలువారుతోంది. అప్పర్‌ పెన్నార్‌, మిడ్‌ పెన్నార్‌, పీఏబీఆర్‌, బీటీపీ, చాగల్లు.. ఒకటేమిటి.. ప్రతి ప్రాజెక్టూ నిండుకుండలా మారింది. అనూహ్యమైన వరదతో ఉమ్మడి అనంతపురం జిల్లా పులకించిపోతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు.. వాటి తాజా పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 


బీటీపీకి ఉప్పొంగిన ప్రవాహం 

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల మధ్యలో వేదావతి నది పై 1961లో నిర్మించిన భైరవాన్‌ తిప్ప ప్రాజెక్టుకు వరద నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. మొన్నటి వరకు ఒట్టిపోయిన జలాశయం ఇప్పుడు నిండుకుండలా మారింది. కర్ణాటకలో వర్షాల కారణంగా చరిత్రలో తొలిసారిగా 60 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. 2.1 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయానికి 2010లో నదికి నీరు వదిలే స్థాయిలో వరద వచ్చింది. ఆ ఏడాది వెయ్యి క్యూసెక్కుల నుంచి 3వేల క్యూసెక్కుల వరకు నీటిని వదిలారు.  


4 దశాబ్దాలకు నిండిన ఎంపీఆర్‌ 

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని పెనకచెర్ల సమీపంలో పెన్నా నది పై 1963లో మిడ్‌ పెన్నార్‌ డ్యాం నిర్మాణం ప్రారంభించి, 1968లో పూర్తి చేశారు. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు కాగా, దక్షి ణ కాలువ కింద 14వేల ఎకరాలు, ఉత్తర కా లువ కింద 10వేల ఎకరాలను స్థిరీకరించారు.  తొలిసారి 1981లో భారీ వరద వచ్చింది. దీంతో 1.2 లక్షల క్యూసెక్కులు వదిలారు. ఆ తర్వాత 4 దశాబ్దాలకు మళ్లీ ఎగువ నుంచి 14 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 17 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. 


పేరూరు డ్యాంకు భారీ వరద 

శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం లోని పేరూరు వద్ద అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1953లో ప్రారంభించి.. 1956లో పూర్తి చేశారు. డ్యాం సామర్థ్యం 1.8 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 1.71 టీఎంసీల నిల్వ ఉం చారు. కర్ణాటక నుంచి వరద రావడంతో గడిచిన 45 రోజుల్లో 10 టీఎంసీల నీటిని కిందకు వదిలారు. శుక్రవారం డ్యాంకు 8 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, రెండు గేట్ల ద్వారా 7వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పేరూరు డ్యాం చరిత్రలో 5గేట్లను ఎత్తడం ఇది మూడోసారి మాత్రమే. 


చాగల్లుకు 35వేల క్యూసెక్కులు

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని చాగల్లు సమీపంలో పెన్నా నదిపై చాగల్లు రిజర్వాయర్‌ను నిర్మించారు. 2005లో నిర్మాణ పనులు ప్రారంభించి, 2012లో పూర్తి చేశారు. నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1టీఎంసీ నిల్వ చేశారు. ఎగువ నుంచి 35వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 8 గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కులు నదికి వదులుతున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం తరువాత తొలిసారి గేట్లను ఎత్తారు. 


పీఏబీఆర్‌.. తొలిసారి గేట్లెత్తారు 

అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు సమీపంలో పెన్నా నదిపై పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను(పీఏబీఆర్‌) నిర్మించారు. డ్యాం నిర్మాణ పనులు 1979లో మొ దలై.. 1993లో పూర్తయ్యాయి. తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే నీటిపైనే (హెచ్చెల్సీ) పీఏబీఆర్‌ ఆధారపడింది. ఈ కారణంగా డ్యాం నిర్మించిన తరువాత గేట్లు ఎత్తిన సందర్భాలే లేవు. పీఏబీఆర్‌ చరిత్రలో తొలిసారి మొత్తం 7గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. డ్యాం నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు. లీకేజీల కారణంగా 5టీఎంసీలకు మించి నిల్వ చేయడం లేదు. ప్రస్తు తం 5.8 టీఎంసీల వరకూ నిల్వ ఉంది. పీఏబీఆర్‌లోకి శుక్రవారం 15వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 14,100 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. 

Read more