ప్రైవేటుకు ఇవ్వడమే మేలు!

ABN , First Publish Date - 2022-02-23T08:39:36+05:30 IST

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నా.. కృష్ణపట్నం శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని (ఏపీఎ్‌సడీటీపీఎస్‌) ప్రైవేటు సంస్థలకే అప్పగించేందుకు ఇంధన శాఖ సన్నద్ధమవుతోంది. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు కూడా..

ప్రైవేటుకు ఇవ్వడమే మేలు!

కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రంపై సీఎంకు ఇంధన శాఖ నివేదన?

త్వరలోనే ‘ఆర్‌ఎఫ్‌సీ’ నోటిఫికేషన్‌

విద్యుత్‌ సంఘాల డిమాండ్లు తోసివేత?

సజ్జల, బాలినేని హామీలు నమ్మి జాక్‌ ఆందోళనలకు వారం విరామం

నేటితో ఆ గడువూ పూర్తి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నా.. కృష్ణపట్నం శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని (ఏపీఎ్‌సడీటీపీఎస్‌) ప్రైవేటు సంస్థలకే అప్పగించేందుకు ఇంధన శాఖ సన్నద్ధమవుతోంది. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు కూడా నివేదించినట్లు తెలిసింది. దీంతో విద్యుత్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ కేంద్రం ఆపరేషన్‌, నిర్వహణ బాధ్యతలను పాతికేళ్లకు ప్రైవేటుకు లీజుకివ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి(జాక్‌) పట్టుబడుతున్నా ప్రభుత్వం తన నిర్ణయానికి అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ కేంద్రం నిర్మాణానికి కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నుంచి రూ.20వేల కోట్ల రుణాలు తీసుకున్నామని ఇంధనశాఖ చెబుతోంది. ఇందులో రూ.4,200కోట్ల రుణానికి ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలుపకుండా తిరస్కరించింది. ఈ రుణానికి సంబంధించి గత ఏడాది జూలై నుంచి నవంబరు దాకా రూ.1,370 కోట్ల బకాయిలను ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలకు చెల్లించలేదు. అంతేకాకుండా విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి చేసిన కరెంటును విక్రయించాక కూడా.. దాదాపు రూ.2,106 కోట్ల దాకా నష్టాలు వచ్చాయని ప్రభుత్వం వాదిస్తోది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌డీఎ్‌సటీపీఎస్‌ ఆపరేషన్‌, నిర్వహణ బాధ్యతను  25 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని గత నెల 21వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. ఇందుకోసం ఇంధన శాఖ త్వరలోనే ప్రైవేటు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్‌ఎఫ్‌సీ) కోరుతూ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వనుంది.

హామీని నమ్మి ఆందోళనల విరమణ..

కృష్ణపట్నం విద్యుత్కేంద్రంపై ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ జాక్‌ దశల వారీ ఆందోళనలకు దిగిన సంగతి తెలిసింది. నిరసనలు తీవ్రతరం కావడం.. ఏపీ జెన్‌కో సహాయ నిరాకరణకు పిలుపివ్వడంతో ఈ నెల 16వ తేదీన ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌, జెన్కో ఎండీ శ్రీధర్‌, డిస్కమ్‌ల సీఎండీలు జాక్‌ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. వేతన సవరణ బాధ్యతను గతంలో మాదిరిగా ట్రాన్స్‌కో అధికారుల కమిటీకే ఇవ్వాలని.. కృష్ణపట్నం థర్మల్‌ను ప్రైవేటుకు అప్పగించవద్దన్న డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నందున ఆందోళనలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన జాక్‌.. వారం రోజులు ఆందోళన చేపట్టకుండా సంయమనం పాటిస్తామని వెల్లడించింది. ఈ గడువు బుధవారంతో ముగుస్తుంది. జాక్‌ డిమాండ్లు సీఎం వద్దకు చేరాయి. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కృష్ణపట్నం థర్మల్‌ ఆపరేషన్‌, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడమే మేలంటూ ఇంధన శాఖ సీఎంకు తెలియజేసిందని జాక్‌ ఆక్షేపిస్తోంది. దీనిపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సజ్జల హామీని నమ్మి ఆందోళనలకు విరామం ఇవ్వాల్సింది కాదని.. కొనసాగించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.

అది ఏపీ జెన్‌కోది కాదు..

కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రం ఏపీ జెన్‌కోకు చెందినది కాదని.. ప్రత్యేక కార్పొరేషన్‌ కింద నడుస్తోందని ఇంధన శాఖ చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందున జెన్‌కోతో పాటు.. అప్పటి డిస్కమ్‌లన్నిటికీ ఇందులో వాటాలున్నాయని.. తెలంగాణ డిస్కమ్‌ల వాటా దాదాపు 27శాతం వరకూ ఉందంటోంది. ఇక్కడ జెన్‌కో ఇంజనీరింగ్‌ సిబ్బంది డిప్యుటేషన్‌పైనే పనిచేస్తున్నారని, డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ సంస్థపై హక్కు ఎక్కడుంటుందని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే జెన్కో సిబ్బందిని వారి మాతృ సంస్థకు పంపిస్తున్నామని అంటోంది. జాక్‌ వాదనలో పస లేదని వాదిస్తోంది. దీనినిబట్టి కృష్ణపట్నం థర్మల్‌ ఆపరేషన్‌, నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించేందుకే ఇంధన శాఖ సిద్ధమైనట్లు తేలిపోతోందని విద్యుత్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం తర్వాత జాక్‌ కార్యాచరణ ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-02-23T08:39:36+05:30 IST