ప్రాణం తీసిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ!

ABN , First Publish Date - 2022-04-24T08:55:10+05:30 IST

చార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోయిన ఘటనలో..

ప్రాణం తీసిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ!

చార్జింగ్‌ చేస్తుండగా పేలిన బ్యాటరీ

యజమాని మృతి.. భార్య పరిస్థితి విషమం

బైక్‌ కొని 24 గంటలు కాకముందే దుర్ఘటన

విజయవాడలో సంచలనం సృష్టించిన ఘటన


విజయవాడ(సత్యనారాయణపురం), ఏప్రిల్‌ 23: చార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోయిన ఘటనలో.. కుటుంబ యజమాని చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. యజమాని భార్య పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ గులాబితోటలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. గులాబితోట రెండో లైన్‌లో నివసించే కోటకొంట శివకుమార్‌ శుక్రవారం‘కార్బెట్‌ 14’ అనే ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుగోలు చేశారు. అదే రోజు రాత్రి తాము నిద్రించే గదిలో దీని బ్యాటరీని చార్జింగ్‌ పెట్టి.. నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చార్జింగ్‌కు పెట్టిన బ్యాటరీ నుంచి మంటలు వచ్చి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఘటన జరిగిన గదిలో శివకుమార్‌(40)తో పాటు ఆయన భార్య హారతి(30), కుమార్తెలు బిందుశ్రీ(10), శశి(6) ఉన్నారు. బ్యాటరీ పేలడంతో మంటలు ఒక్కసారిగా గది మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో గదిలో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఓవైపు మంటలు.. మరోవైపు పొగతో ఊపిరాడక కేకలు పెట్టారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి.. గది తలుపులు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే గదిలో ఉన్న నలుగురికీ తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో శివకుమార్‌ మృతి చెందారు. హారతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.శివకుమార్‌ కుమార్తెలు బిందుశ్రీ, శశిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఇంట్లోని బీరువా, ఫ్రిజ్‌, ఏసీ, కుట్టుమిషన్‌తోపాటు సామగ్రి కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


షార్ట్‌ సర్క్యూటా.. నాణ్యత లోపమా?

ఎలక్ట్రిక్‌ బైకుల్లో సాధారణంగా లిథియం ఐయాన్‌ బ్యాటరీలు వాడుతారు. ఇవి మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు తట్టుకోగలవు. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతను అవి తట్టుకోలేవు. మన దేశంలో వేసవిలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బయట ఉష్ణోగ్రత ఈ స్థాయిలో ఉన్నప్పుడు లిథియం బ్యాటరీల ఉష్ణోగ్రత 50 నుంచి 55 డిగ్రీలు నమోదవుతుంది. దీంతో బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అయితే, వినియోగదారులకు ఆయా విషయాలపై అవగాహన కల్పించడంలో ఎలక్ట్రిక్‌ బైకుల తయారీ కంపెనీలు దృష్టి పెట్టడం లేదు. ఒక్కోసారి ఇంట్లో వైరింగ్‌ పాతది కావడమో లేక నాసిరకం వైరింగ్‌ వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున విజయవాడలో జరిగిన ఘటనలో బ్యాటరీలో నాణ్యతలోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందా అన్నది నిర్ధారించాల్సి ఉంది. 

Read more