ఈసీ ఆదేశాలూ బేఖాతర్‌

ABN , First Publish Date - 2022-10-07T08:24:17+05:30 IST

ఈసీ ఆదేశాలూ బేఖాతర్‌

ఈసీ ఆదేశాలూ బేఖాతర్‌

పులివెందుల కమిషనర్‌ అత్యుత్సాహం.. వలంటీర్లకు ఎన్నికల విధులు 

కడప, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మున్సిపల్‌ అధికారులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేశారు. పట్టభద్రుల వివరాలు సేకరించండి అంటూ వలంటీర్లకు టెలి కాన్ఫరెన్స్‌లో హుకుం జారీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 1 నుంచి ఓటు నమోదుకు పట్టభద్రులకు ఈసీ అవకాశం కల్పించింది. కడప, కర్నూలు, అనంతపురం స్థానానికి టీడీపీ నుంచి గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వైసీపీ నుంచి వెన్నపూస రవీంద్రనాథరెడ్డి, మరికొందరు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓ అధికారి టెలి కాన్ఫరెన్స్‌లో... ‘మీ పరిధిలో ఉండే పట్టభద్రుల వివరాలు సేకరించి వారికి ఓటు హక్కు కల్పించండి. ఆ వివరాలన్నీ అందజేయండి’ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్‌ వలంటీర్ల ప్రమేయం వద్దంటూ ఇప్పటికే విస్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఏమాత్రం లెక్కచేయకుండా అధికారి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీనిపై టీడీపీ నేత భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మీకు రాజకీయాలంటే అంత ఇష్టముంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి’ అని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-10-07T08:24:17+05:30 IST