హోదా ఇవ్వదు.. హామీలు నెరవేర్చదు..

ABN , First Publish Date - 2022-06-23T08:23:09+05:30 IST

హోదా ఇవ్వదు.. హామీలు నెరవేర్చదు..

హోదా ఇవ్వదు.. హామీలు నెరవేర్చదు..

అయినా ఎన్‌డీఏకే జగన్‌ మద్దతు!

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓటు అటే!!

రాజకీయ వర్గాల ఆక్షేపణ

బీజేపీపై ఒత్తిడికి ఇదే చాన్సు.. అలాగైతే హోదా, పోలవరం,

రైల్వే జోన్‌ సాకారం ఖాయం!

మోదీ-షా ఎదుట డిమాండ్లు పెట్టాలని సూచన


అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ల దాటినా మోదీ ప్రభుత్వంఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం తుది అంచనా వ్యయం రూ.55548.87 కోట్లకు ఆమోదం, విశాఖ రైల్వే జోన్‌ వంటి అనేక విభజన హామీలను నెరవేర్చలేదు. అయినా సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాటనడం లేదు. సరికదా.. పార్లమెంటులో అవసరమైనప్పుడల్లా బేషరతుగా మద్దతిచ్చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే పంథా అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించిన ప్రతిపక్షాల భేటీకి రమ్మని జగన్‌కు లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదు. ఇంకోవైపు.. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్‌డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వాలంటే కొన్ని షరతులు విధించాలని.. అవి నెరవేరిస్తేనే అనుకూలంగా ఓటేస్తామని ఒత్తిడి తేవాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలేమిటో చెబుతూ యువతను రెచ్చగొట్టారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. హోదా కోసం దీక్ష చేపట్టి.. ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు ఉబ్బడిముబ్బడిగా ఉంటాయని.. రాష్ట్రానికి పరిశ్రమలు తామరతంపరగా వచ్చేస్తాయని.. రాష్ట్రంలో యువతకు నిరుద్యోగమన్నదే కనిపించదని ఊదరగొట్టారని గుర్తుచేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు.. సీఎం పదవి చేపట్టకముందే జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని.. ఇతర పార్టీల మద్దతు దానికి అవసరం లేదని.. హోదా కావాలని అడుగుతూ పోవడం తప్ప ఒత్తిడి తీసుకురాలేమని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ గెలవాలంటే వైసీపీ, ఒడిసాలో బీజేడీ మద్దతు తప్పనిసరని.. అందుచేత రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ వంటి డిమాండ్లు మోదీ ముందు పెట్టాలని.. అప్పుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తారని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అదీగాక.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయానికి వైసీపీ మద్దతు కీలకమని ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇటీవల పదే పదే చెబుతున్నారని గుర్తుచేస్తున్నాయి. అలాంటప్పుడు రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నిటినీ నెరవేర్చాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను జగన్‌ ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని నిలదీస్తున్నాయి. కేంద్రం ముందు ఈ డిమాండ్లను ఉంచకపోయినా.. మమత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ వ్యూహరచన ఏమిటో తెలిసేదని, జాతీయ మీడియా రాష్ట్ర అంశాలపై దృష్టి కేంద్రీకరించేదని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ ఇదేమీ చేయకుండా మౌన ముద్ర దాల్చడం.. దీనిపై మాట్లాడకుండా వైసీపీ ముఖ్య నేతలను సైతం కట్టడి చేయడం చూస్తుంటే.. రాష్ట్ర ప్రయోజనాలను కాదని స్వీయ ప్రయోజనాల కోసం మరోసారి ఎన్‌డీఏకి బేషరతుగా మద్దతు తెలిపేందుకు సిద్ధమైపోయారని తెలిసిపోతుందని అంటున్నారు. గతంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్‌డీఏ అభ్యర్థిగా నిలబెట్టిన సమయంలోనూ షరతుల్లేకుండా మద్దతిచ్చారని.. ఇప్పుడూ అదే పరిస్థితి కనబడుతోందని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-23T08:23:09+05:30 IST