నిందితుల ఇళ్లకు రాత్రివేళ వెళ్లొద్దు!

ABN , First Publish Date - 2022-09-13T08:15:31+05:30 IST

పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌(పీఎ్‌సవో) ఆధారంగా రౌడీషీట్లు తెరవడం, వాటిని సుధీర్ఘ కాలంపాటు కొనసాగించడం, వ్యక్తులపై నిఘా పెట్టడం వంటివి వీల్లేదని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్‌ చేసింది.

నిందితుల ఇళ్లకు రాత్రివేళ వెళ్లొద్దు!

  • పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ఆధారంగా రౌడీషీట్‌ తెరిచేందుకు వెసులుబాటు
  • రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశం
  • ‘రౌడీషీట్‌’పై సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల సస్పెన్షన్‌

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌(పీఎ్‌సవో) ఆధారంగా  రౌడీషీట్లు తెరవడం, వాటిని సుధీర్ఘ కాలంపాటు కొనసాగించడం, వ్యక్తులపై నిఘా పెట్టడం వంటివి వీల్లేదని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్‌ షీట్లు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు తిరిగి తెరవడానికి వీల్లేదని పోలీసులకు తేల్చి చెప్పింది. తాజాగా ఏమైనా ఆధారాలు లభిస్తే వాటి ప్రకారం ఆయా వ్యక్తులపై ఆయా షీట్లు తెరిచేందుకు పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది. నిందితుడు, అనుమానితుడిపై నిఘా ఉంచాలనుకుంటే ప్రస్తుతానికి పీఎ్‌సవో ప్రకారం వ్యవహరించవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి లేదా నిందితుడిని స్టేషన్‌కు పిలవాలనుకుంటే చట్టప్రకారం ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని తెలిపింది. అరెస్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు, అప్పటికే నమోదైన కేసులో నిందితుడిని, అనుమానితుడిని అదుపులోకి తీసుకోవడానికి తప్ప రాత్రి వేళ్లలో పోలీసులు నిందితుల ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వేలిముద్రలు సేకరించాలని భావిస్తే సింగిల్‌ జడ్జి పేర్కొన్న విధంగా చట్టనిబంధనలకు లోబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది.


 ఈ మేరకు జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ బి. శ్యాం సుందర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీఎ్‌సవో ఆధారంగా తమపై రౌడీషీట్‌ తెరవడం, సుధీర్ఘ కాలం కొనసాగించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో 57 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పీఎ్‌సవోను అనుసరించి రౌడీషీట్‌ తెరవడం, కొనసాగించడం వంటివి వీల్లేదని తీర్పు ఇచ్చారు. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్‌ తెరవడం, రాత్రిపూట ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటివి చేయకూడదని తేల్చిచెప్పారు. అయితే, సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసి.. సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


ధర్మాసనం ఏం చెప్పిందంటే

‘‘కేఎస్‌ పుట్టస్వామి కేసులో గోప్యతహక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న సింగిల్‌ జడ్జి.. రౌడీషీట్లు తెరవడం, నిందితులపై నిఘా ఉంచడం గోప్యత హక్కును హరించడమేనని పేర్కొన్నారు. కానీ, హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పుట్టస్వామికేసుకి, ప్రస్తుత కేసుకి సంబంధం లేదన్నారు. ప్రస్తుత కేసు.. నేరాలను నియంత్రించేందుకు నిందితులపై రౌడీషీట్‌ తెరిచిన వ్యవహారమన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనను ఈ దశలో తోసిపుచ్చలేం. ఓ వ్యక్తిపై రౌడీ షీట్‌ తెరవడం గోప్యతహక్కుకు భంగం కలిగించినట్లేనా? ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరముంది. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ కార్యనిర్వాహక మార్గదర్శకాలేనని సుంకర సత్యనారాయణ కేసులో గతంలో ఇదే హైకోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఆ కారణంతో రౌడీషీట్‌ మాత్రం కొట్టివేయలేదు. రౌడీషీట్లు తెరవడం, మూసివేయడాన్ని క్రమబద్ధీకరించేందుకు పలు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ముందు ఉన్న వివరాలు పరిగణనలోకి తీసుకుని రౌడీషీట్‌ తెరిచే విషయంలో సింగిల్‌ జడ్జి తీర్పుని సస్పెండ్‌ చేస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది.

Read more