పాడి రైతులకు మరింత చేయూత

ABN , First Publish Date - 2022-01-29T09:05:23+05:30 IST

వ్యవసాయంపైనే ఆధారపడితే రైతులకు గిట్టుబాటు కాదని, పాడి పరిశ్రమ కూడా తోడైతేనే గిట్టుబాటయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పాడి రైతుకు మరింత

పాడి రైతులకు మరింత చేయూత

  • సాగుకు పాడి తోడైతేనే గిట్టుబాటు
  • అమూల్‌ రాకతో పోటీ వాతావరణం
  • ఆ కంపెనీకి ప్రభుత్వం అండ: జగన్‌
  • ‘అనంత’లో జగనన్న పాలవెల్లువ ప్రారంభం
  • అమూల్‌తో ప్రభుత్వం 2 ఒప్పందాలు
  • రాష్ట్రంలో బాలామృతం ప్లాంట్‌ స్థాపన
  • అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా 


అమరావతి, జవనరి 28 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంపైనే ఆధారపడితే రైతులకు గిట్టుబాటు కాదని, పాడి పరిశ్రమ కూడా తోడైతేనే గిట్టుబాటయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పాడి రైతుకు మరింత చేయూత ఇచ్చేందుకు అమూల్‌ను రాష్ట్రానికి తెచ్చామని, ఎలాంటి మోసాలు లేకుండా ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందని చెప్పారు. పాల ప్రొసెసింగ్‌లో వచ్చిన లాభాలను కూడా ప్రతి ఆర్నెల్లకోసారి పాడి రైతులకు అమూల్‌ బోన్‌సగా తిరిగిస్తుందన్నారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో అమూల్‌ ప్రాజెక్ట్‌ ద్వారా పాల సేకరణను శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలో బాలామృతం ప్లాంట్‌ స్థాపించేందుకు, అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వ అధికారులు సీఎం సమక్షంలో రెండు ఒప్పందాలు చేసుకున్నారు. ‘‘అమూల్‌ రాక ముందు వాటర్‌ బాటిల్‌ రూ.23 ఉంటే, లీటరు పాలకు రూ.23 కూడా రావడం లేదని అక్కచెల్లెమ్మలు చెప్పేవారు.


ఆ పరిస్థితులు మార్చేందుకు అమూల్‌ని తీసుకొచ్చాం. అమూల్‌ రాకతో మిగిలిన పాల డెయిరీలు ధర పెంచాయి. లీటరుకు రూ.5 నుంచి రూ.20 దాకా అదనంగా వస్తున్నట్లుంది. పాల సేకరణ ప్రాంతాల్లో ప్రభుత్వం 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూలు ఏర్పాటు చేస్తోంది. వీటి వల్ల పారదర్శకతతో పాల సేకరణ జరుగుతుంది. అమూల్‌ పెట్టే ప్రతి అడుగులో రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అమూల్‌ విస్తరించే కొద్దీ అన్ని గ్రామాల్లో ఏఎంసీయూలు, బీఎంసీయూలు ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు పాల సేకరణలో జరిగే మోసాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసలు నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్లు తేలింది. ప్రస్తుత 13 జిల్లాల్లో 6 జిల్లాల్లో అమూల్‌ అడుగుపెట్టింది. ఇప్పుడు ఏడో జిల్లా అనంతపురంలో పాల సేకరణ ప్రారంభిస్తోంది’’ అని జగన్‌ అన్నారు.

Updated Date - 2022-01-29T09:05:23+05:30 IST