శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం
ABN , First Publish Date - 2022-10-17T10:22:59+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది.
తిరుమల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది. దీపావళి రోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా మలయప్పస్వామిని దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసే సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి విష్వక్సేనులస్వామిని కూడా స్వామికి ఎడమ పక్క మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేస్తారు. తర్వాత స్వామికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలు అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దాంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సహస్రదీపాలంకరణసేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనమిస్తారు. కాగా, దీపావళి ఆస్థానం సందర్భంగా ఆరోజు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.