విభజన నిధులు వెనక్కి!

ABN , First Publish Date - 2022-12-07T02:50:02+05:30 IST

కేంద్రం రాష్ట్రానికిచ్చిన నిధుల నుంచి రూ.1,000 కోట్లు వెనక్కి తీసుకుందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

విభజన నిధులు వెనక్కి!

వెయ్యి కోట్లు తీసేసుకున్న కేంద్రం!!

సంస్కరణల గ్రాంట్లు అయి ఉండొచ్చు ఆర్థిక నిపుణుల అంచనా

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కేంద్రం రాష్ట్రానికిచ్చిన నిధుల నుంచి రూ.1,000 కోట్లు వెనక్కి తీసుకుందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఈ వెయ్యి కోట్లను రాష్ట్రం బకాయిపడిందని.. ఆ డబ్బునే కేంద్రం తాజాగా తీసుకుందని ఆర్థిక శాఖలో ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర విభజనను పురస్కరించుకుని కేంద్రమే రాష్ట్రప్రభుత్వానికి నిధులివ్వాల్సి ఉంది. అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, ఒక్క రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూపంలోనే ఇంకా రూ.35,000 కోట్లు రావాలని ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఇవి కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్లను 58:42 నిష్పత్తిలో పంచాలంటూ షీలా బిడే కమిటీ ఇచ్చిన నివేదికనే కేంద్రం ఇంతవరకూ అమలు చేయలేదు.

ఇలా రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వెయ్యి కోట్లు వెనక్కి తీసుకోవడంపై ఆర్థిక శాఖలో గందరగోళం నెలకొంది. వెనక్కి తీసుకున్న ఆ సొమ్ము సంస్కరణలకు సంబంధించిన గ్రాంట్‌ అయిఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడం వల్లే వాటికిచ్చిన గ్రాంట్లను కేంద్రం వెనక్కి తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆర్థిక శాఖ అన్ని విషయాలనూ రహస్యంగా ఉంచుతోంది. ఆ శాఖలో ఉన్న ఒక్కో కార్యదర్శిది ఒక్కో తీరు. ఎవరి దారి వాళ్లదే అన్నట్లుగా కార్యకలాపాలున్నాయి. అందుకే అసలు ఆ శాఖలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం అప్పులు తేవడం, ఉద్యోగుల తొలగింపు, ఖాళీ పోస్టుల రద్దు, కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ బిల్లుల కేసులు తప్పించుకోవడం వంటి పనులకే ఈ శాఖ పరిమితమైందని.. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా ఎన్ని నిధులు రావాలి.. వాటిని ఎలా తెచ్చుకోవాలో ఆర్థిక శాఖలోని కార్యదర్శులకు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-12-07T02:50:03+05:30 IST