Diploma: పేరుకే డిప్లొమా..నెరవేరని ఉపాధి ధీమా..!
ABN , First Publish Date - 2022-12-16T01:02:42+05:30 IST
డిప్లొమా.. పదో తరగతి పూర్తవగానే త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో చేరే కోర్సు ఇది. కానీ ఇప్పుడు డిప్లొమా తీరు మారిపోయింది. ముందు ఈ కోర్సులో చేరినా పూర్తవగానే ఉపాధి దిశగా కాకుండా వెంటనే ఇంజనీరింగ్‌లో చేరుతున్న ట్రెండ్ పెరిగింది.
కోర్సు పూర్తికాగానే ఇంజనీరింగ్‌లోకి విద్యార్థులు
95 ు మంది మారిపోతున్నట్లు గుర్తింపు
డిప్లొమాతో ఉపాధి పొందుతున్నవారే లేరు
అవగాహన కల్పించడంలో సాంకేతిక విద్యాశాఖ విఫలం
వరుసగా ఆరేళ్లు విద్యా దీవెన
(అమరావతి - ఆంధ్రజ్యోతి): డిప్లొమా.. పదో తరగతి పూర్తవగానే త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో చేరే కోర్సు ఇది. కానీ ఇప్పుడు డిప్లొమా తీరు మారిపోయింది. ముందు ఈ కోర్సులో చేరినా పూర్తవగానే ఉపాధి దిశగా కాకుండా వెంటనే ఇంజనీరింగ్‌లో చేరుతున్న ట్రెండ్ పెరిగింది. గతంలో ఇలా ఇంజనీరింగ్‌లో చేరేవారు సుమారు 50 శాతం ఉంటే ఇప్పుడది దాదాపు 95శాతానికి చేరుకున్నట్లు ఉన్నత విద్యాశాఖ గుర్తించింది. అంటే డిప్లొమా అవగానే ఈసెట్ రాసి ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరిపోతున్నారు. దీంతో ఉపాధి పొందాలని భావించి చేరిన డిప్లొమా కోర్సు అసలు ఉద్దేశం పూర్తిగా దెబ్బతింటోంది. ఇంటర్మీడియట్‌కు బదులుగా డిప్లొమాలో చేరి మూడేళ్లు కాగానే ఇంజనీరింగ్‌కు మారిపోతుండటంతో డిప్లొమా ఆధారిత ఉపాధి అవకాశాల కల్పన రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. గత విద్యా సంవత్సరంలో సుమారు 20వేల మంది డిప్లొమా కోర్సు పూర్తిచేయగా.. వారిలో చివరికి 800 మంది మాత్రమే దానిపై ఆధారపడి ఉపాధి పొందేందుకు మిగిలారని, మిగిలిన వారంతా ఇంజనిరింగ్లో చేరిపోయారని ఓ అధికారి తెలిపారు.
ఈ ట్రెండ్ చూస్తుంటే ఇక డిప్లొమా ఆధారిత ఉద్యోగాలు చేసేవారు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 50వేల మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నారు. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 37వేలకు పడిపోయింది. 70వేల వరకు సీట్లున్నా దాదాపు సగమే భర్తీ అవుతున్నాయి. అడ్మిషన్లు ఇలా ఉంటే ఫైనల్ ఇయర్‌కు వచ్చేసరికి వారి సంఖ్య ఇంకా తగ్గిపోతోంది. దీంతో సుమారు 25 వేల మందే మూడేళ్లు చదివి సర్టిఫికెట్తో బయటకు వస్తున్నారు. ఈ ఏడాది 20వేల మందికిపైగా ఇంజనీరింగ్‌లో చేరారు. 2019లో 26,329 మంది, 2020లో 20,026 మంది, 2021లో 23,768 మంది ఇంజనీరింగ్‌లో చేరారు. అంటే దాదాపు 95శాతం ఇంజనీరింగ్కే వెళ్తున్నారు.
విద్యా దీవెన ఒక కారణం
వాస్తవానికి డిప్లొమాలో చేరే సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉపాధి లక్ష్యంగా చూస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల డిప్లొమా పూర్తిచేసి ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ ఇంజనీరింగ్ విద్యకున్న డిమాండ్, దాని ద్వారా వచ్చే భారీ ప్యాకేజీ ఉద్యోగావకాశాలతో దారి మార్చుకుంటున్నారు. మరోవైపు విద్య దీవెన కూడా దీనికి ఒక కారణంగా మారింది. ఇంటర్లో చేరితే అమ్మఒడి తప్ప విద్యా దీవెన పథకం అమలుకాదు. డిప్లొమాలో చేరితో మూడేళ్లకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అనంతరం మూడేళ్లు ఇంజనీరింగ్ చదివితే దానికీ విద్యా దీవెన అందుతుంది. దీంతో వరుసగా ఆరేళ్ల పాటు ఫీజుల దిగులు లేకుండా ఇంజనీరింగ్ పట్టా పొందే అవకాశం దొరుకుతోంది. దీంతో ఆర్థిక స్తోమత లేనివారు ఈ ధీమాతో ఇంజనీరింగ్ వైపు వస్తున్నారు. అలాగే ఈసెట్ ద్వారా ద్వితీయ సంవత్సరంఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు కావాల్సినన్ని సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. 10 శాతం సీట్లు ప్రత్యేకంగా ఈసెట్ కోటాకు ఉంటాయి. వాటితో పాటు ముందు సంవత్సరం మిగిలిపోయిన సీట్లన్నీ ఈసెట్‌కు వర్తిస్తాయి. దీంతో డిప్లొమా విద్యార్థులకు కచ్చితంగా సీట్లు దొరుకుతున్నాయి.
ఉద్యోగాలున్నాయి... పంపండి
ఇటీవల సాంకేతిక విద్యాశాఖ అధికారులు శ్రీసిటీ, ఇతర పారిశ్రామిక కారిడార్లలో పర్యటించి ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. అందులో డిప్లొమా సర్టిఫికెట్ ఉంటే వెంటనే ఉద్యోగం ఇస్తామని, విద్యార్థులను పంపాలని పలువురు వారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే విద్యార్థులు మాత్రం ఆ ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే వచ్చే ఏడాది నుంచి పారిశ్రామిక ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కోర్సులోనే కొంతకాలం ఏదైనా పరిశ్రమలో ఇన్టర్న్షిప్ చేస్తే దానివల్ల డిప్లొమాపై ఉద్యోగాలకు ఆసక్తి చూపొచ్చని అధికారులు అంటున్నారు.
మాకే తెలియదు
పైకి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నా సాంకేతిక విద్యాశాఖ ఇందులో విఫలమవుతోంది. ఏటా కేవలం అడ్మిషన్ల వరకు హడావిడి చేస్తున్న ఈ శాఖ అనంతరం విద్యార్థులు ఏంచేస్తున్నారనేది పట్టించుకోవడం లేదు. అసలు ఏటా ఎంతమంది విద్యార్థులు డిప్లొమా పూర్తిచేస్తున్నారనే వివరాలు కూడా సాంకేతిక విద్యాశాఖ వద్ద లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అడ్మిషన్లు తీసుకుని వదిలేయడమే తమ పని అన్నట్టుగా సాంకేతిక విద్యాశాఖ వ్యవహరిస్తోంది.