మోదీ మాటలు, చేతల్లో తేడా: రాహుల్‌

ABN , First Publish Date - 2022-08-18T10:47:12+05:30 IST

బిల్కిస్‌ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు.

మోదీ మాటలు, చేతల్లో తేడా: రాహుల్‌

  • మహిళలకు గౌరవం ఉపన్యాసాల్లోనేనా: ప్రియాంక గాంధీ
  • బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదలపై ధ్వజం

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బిల్కిస్‌ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని  మాటల్లో, చేతల్లో తేడాను దేశమంతా చూస్తోందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు తెలియకుండానే, వారి ఆమోదం లేకుండానే గుజరాత్‌ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసిందా అని ప్రశ్నించారు. ‘‘ఐదు నెలల గర్భిణీని రేప్‌ చేయడంతోపాటు మూడేళ్ల వయసున్న ఆమె కూతుర్ని హత్యచేసిన వారిని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ రోజు విడుదల చేశారు. నారీ శక్తి అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నవాళ్లు... ఈ ఖైదీల విడుదల ద్వారా దేశంలోని మహిళలకు ఎలాంటి సందేశం ఇవ్వదల్చుకున్నారు?’’ అని రాహుల్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... తమకు గౌరవం కేవలం ఉపన్యాసాల్లోనేనా అని మహిళలు అడుగుతున్నారన్నారు.


గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినవారిని విడుదల చేయటం, ఖైదీలకు కెమేరాల ముందు స్వాగతం పలకటం అన్యాయానికి, అమానుషత్వానికి పరాకాష్ట కాదా అన్నారు. ఖైదీల విడుదల బీజేపీ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్‌ మరో నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఖైదీలను విడుదల చేయాలని సిఫార్సుచేసిన సలహా కమిటీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. 2002లో గోద్రాలో జరిగిన అల్లర్లలో బిల్కిస్‌ బానోపై గ్యాంగ్‌ రేప్‌తోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు 2008లో 11మందికి జీవిత ఖైదు విధించింది. 15ఏళ్ల తర్వాత ఖైదీలు క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.... వారి దరఖాస్తులను పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటుచేసిన గుజరాత్‌ ప్రభుత్వం... కమిటీ సిఫార్సుల మేరకు ఖైదీలను సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-08-18T10:47:12+05:30 IST