దేవదాయ శాఖలో ధార్మిక పరిషత్‌

ABN , First Publish Date - 2022-08-17T10:14:44+05:30 IST

రాష్ట్ర దేవదాయ శాఖలో ఎట్టకేలకు పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దేవదాయ శాఖలో ధార్మిక పరిషత్‌

మంత్రి సహా 21 మంది సభ్యులు

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవదాయ శాఖలో ఎట్టకేలకు పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిషత్‌లో ఆ శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దేవదాయ శాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా ఉంటారు. వీరితో పాటు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మరో 18 మంది సభ్యులు ఉంటారు. దీనికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం సచివాయంలో మీడియాతో మాట్లాడారు. ధార్మిక పరిషత్‌కు విశేష అధికారాలు ఉన్నాయని తెలిపారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేసే అధికారం పరిషత్‌కు ఉంటుందన్నారు. అవినీతికి, అక్రమాలకు పాల్పడే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం, వారి స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఈ పరిషత్‌కు ఉంటుందని వివరించారు. సీజీఎఫ్‌ కమిటీలో మరో ముగ్గురుకి స్థానం కల్పించామని చెప్పారు. నెల్లూరుకు చెందిన కలికి కోదండ రామిరెడ్డి, విశాఖకు చెందిన మలిరెడ్డి వెంకట అప్పారావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కర్రి భాస్కరరావు సభ్యులుగా కొనసాగుతారన్నారు. ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌లో దాదాపు 4,708 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిలో 722 కేసులు పరిష్కరించినట్టు చెప్పారు. కాగా, రాష్ట్రంలో మరో 2,200 దేవాలయాలను ధూప దీప నైవేద్య పథకం కిందకు తీసుకురానున్నట్టు మంత్రి కొట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద 1500 దేవాలయాలకు నెలనెలా నిధులు ఇస్తున్నామన్నారు. అయితే, మరో 3,500  దేవాలయాల నుంచి ధరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2,200 ఆలయాలను ఈ పథకం అమలుకు అర్హత ఉన్నట్లు గుర్తించారన్నారు.

Read more