ధరణికోట టు ఎర్రకోట
ABN , First Publish Date - 2022-12-16T00:50:58+05:30 IST
అమరావతి రాజధాని రైతులు గురువారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలు దేరారు. రాజధాని 29 గ్రామాలకు చెందిన 1,580 మంది రైతులు, మహిళలు దేశ రాజధానిలో అమరావతి గళం వినిపించడానికి తరలివెళ్లారు.
ఢిల్లీకి పయనమైన అమరావతి రైతులు
17, 18 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద ధర్నా
విజయవాడ (ఆంధ్రజ్యోతి)/తుళ్లూరు, డిసెంబరు 15: అమరావతి రాజధాని రైతులు గురువారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలు దేరారు. రాజధాని 29 గ్రామాలకు చెందిన 1,580 మంది రైతులు, మహిళలు దేశ రాజధానిలో అమరావతి గళం వినిపించడానికి తరలివెళ్లారు. వీరిలో 500 మంది మహిళా రైతులు ఉన్నారు. ‘జై అమరావతి’ నినాదాలు చేస్తూ విజయవాడ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 2.30గంటలకు వీరంతా ప్రత్యేక రైలు ఎక్కారు. ‘ధరణికోట టు ఎర్రకోట’గా ఈ కార్యక్రమాన్ని రైతు జేఏసీ పేర్కొంది. 24 బోగీలు ఉన్న ఈ రైలు శుక్రవారం రాత్రి 10గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. శని, ఆదివారాల్లో (17, 18 తేదీల్లో) జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసిందో బీజేపీ ప్రజా ప్రతినిధులను కలసి విన్నవిస్తారు. అన్ని పార్టీల నేతలను కలసి తమకు సంఘీభావం తెలపాలని కోరతారు. చట్ట ప్రకారం రాజధానికి భూములిస్తే సీఎం జగన్ మూడు రాజధానులని మొండిగా వ్యవహరించడం గురించి ఢిల్లీ పెద్దలకు వివరిస్తామని జేఏసీ నేతలు శివారె డ్డి, గద్దె తిరుపతిరావు పేర్కొన్నారు. 19న భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో రైతులు పాల్గొంటారు. 21న తిరిగి అమరావతికి చేరుకుంటారు.