ఈ ఏడాది అన్నదానం నిలుపుదల

ABN , First Publish Date - 2022-08-31T08:13:27+05:30 IST

‘‘ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అన్నదానం నిలుపుదల చేస్తున్నాం. దానిస్థానంలో చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర ప్లేట్‌లో పెట్టి భక్తులకు అందిస్తాం. రోజుకు 60-70వేల మందికి మాత్రమే అన్నదానం చేసే అవకాశం ఉంది.

ఈ ఏడాది అన్నదానం నిలుపుదల

లక్ష మందికి వడ్డించే సామర్థ్యం లేదు 

దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ


‘‘ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అన్నదానం నిలుపుదల చేస్తున్నాం. దానిస్థానంలో చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర ప్లేట్‌లో పెట్టి భక్తులకు అందిస్తాం. రోజుకు 60-70వేల మందికి మాత్రమే అన్నదానం చేసే అవకాశం ఉంది. రోజుకు లక్ష మంది వస్తే... వారందరినీ కూర్చోబెట్టి, ఆకులు వేసి, కూరలు, అన్నం వడ్డించే సామర్థ్యం దేవస్థానం వద్ద లేకపోవడంతోనే అన్నదానం రద్దు చేశాం’’ అని మంత్రి సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఈ అంశాన్ని వ్యతిరేక కోణంలో కాకుండా సానుకూల వైఖరితో చూడాలని మీడియాకు సూచించారు. మహామండపంలో ఉన్న లిఫ్టులను మొత్తం వీఐపీలు, వీవీఐపీలకు ఉపయోగిస్తామని చెప్పారు. ఉచిత, రూ.100, రూ.300 భక్తులను ఘాట్‌రోడ్డు నుంచి దర్శనానికి పంపుతామన్నారు.


ఇందుకోసం ఘాట్‌రోడ్లులోని ఓం మలుపు వద్ద ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత దర్శనాలకు రెండు క్యూలు, రూ.100, రూ.300 క్యూతో పాటు మరొక లైను ఉంటుందన్నారు. దర్శనం అనంతరం భక్తులు శివాలయం వైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా కిందికి రావాలని మంత్రి సూచించారు. దసరా ఉత్సవాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు రోజుకు ఐదు సిఫారసు లేఖలు ఇవ్వొచ్చన్నారు. విజయవాడలో ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జికి పది లేఖలు కేటాయించామన్నారు. ఒక్కో లేఖపై ఆరుగురికి మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. వారు రూ.500 టికెట్‌ కొనుగోలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యేలు మాత్రం కుటుంబంతో కలసి పది రోజుల్లో ఏదో ఒకరోజున ఉచితంగా దర్శనం చేసుకోవచ్చన్నారు. 

Read more