రుషికొండపైఆగని విధ్వంసం!
ABN , First Publish Date - 2022-08-03T08:28:25+05:30 IST
రుషికొండపైఆగని విధ్వంసం!

జీవీఎంసీ అనుమతి లేకుండానే పనులు
ముద్రగడ అరవింద్ పేరుతో దరఖాస్తు
డాక్యుమెంట్లు అడిగిన అధికారులు
ఇవ్వకపోవడంతో పెండింగ్‌లో దరఖాస్తు
అయినా కొనసాగుతున్న పనులు
విశాఖపట్నం/అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రిసార్టుల పేరుతో రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలకు మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) నుంచి ఏపీటీడీసీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అయినప్పటి కీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముం దస్తు అనుమతి పొందకుండా ఎవరైనా భవన నిర్మాణ పనులు చేపడితే జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు పనులను అడ్డుకుంటారు. అప్పటికే జరిగిన నిర్మాణాలను కూల్చివేస్తారు. కానీ రుషికొండపై ఏకంగా 70 ఎకరాల విస్తీర్ణంలో(సుమారు 2,81,861 చదరపు అడుగులు) అనుమతులు లేకుండా నిర్మాణా లు చేపడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రుషికొండ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించి విధ్వంసం సృష్టిస్తున్నారని కొంతమంది ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయినప్పటికీ ఏపీటీడీసీ మాత్రం పనులను నిలుపుదల చేయడంలేదు. అంతేకాక కోర్టు నుంచి తమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తుందని గ్రహించిన పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు.. ముందుజాగ్రత్తగా రుషికొండపై సర్వే నంబర్లు 19/1, 19/2, 19/3, 19/4లో 3 బ్లాక్‌ల నిర్మాణానికి బిల్డింగ్ ప్లాన్ జారీచేయాలంటూ ముద్రగడ అరవింద్ అనే వ్యక్తి పేరుతో గతనెల 13న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు ఫీజు కింద రూ.10 వేలు చెల్లించడంతో అతని పేరుతో తాత్కాలిక బీఏ నంబరు జనరేట్ అయింది. ఈ దరఖాస్తు జీవీఎంసీ అధికారులకు చేరడంతో దరఖాస్తులో పేర్కొన్న నిర్మాణాలకు సంబంధించిన డాక్యుమెంటులు, సీఆర్‌జడ్ ఎన్వోసీ, ఇతర పత్రాలను అందజేయాలని, అలా గే ప్లాన్ జారీకి డెవల్‌పమెంట్ చార్జీలు, పర్మిషన్ ఫీజు, లేబర్‌సెస్ వంటివన్నీ కలిపి సుమారు రూ.19 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అప్పటినుంచి ఎవరూ జీవీఎంసీ అధికారులను సంప్రదించకపోవడంతో దరఖా స్తు పెండింగ్‌లోనే ఉంది. జీవీఎంసీ అధికారులు కోరిన పత్రాలతోపాటు పేర్కొన్న ఫీజు చెల్లిస్తేనే శాశ్వత ప్లాన్ ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి. అంతవరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రుషికొండపై ఇప్పటికే ఒక అంతస్థు నిర్మాణం పూర్తిచేసి, రెండో అంతస్థు నిర్మాణానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
న్యాయవాదిపై కేసులో హైకోర్టు స్టే
రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, పర్యాటక ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పరిశీలించేందుకు హైకోర్టు సూచనల మేరకు వెళ్లిన సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తిపై పోలీసులు నమోదు చేసిన కేసు లో తదుపరి చర్యలను హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిం ది. విచారణను 2వారాలకు వాయిదావేసింది. ఈమేరకు జస్టిస్ ఎన్ జయసూర్య మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. జూలై 31న రుషికొండపై తవ్వకాల పరిశీలన కు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌తో పాటు మరికొందరు వెళ్లారు. అయితే, అక్రమంగా అక్కడకు ప్రవేశించారంటూ అరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ కేఎ్‌సమూర్తి.. హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ‘‘హైకోర్టు సూచనల మేరకు రుషికొండపై తవ్వకాలు పరిశీలించేందుకు పిటిషనర్ వెళ్లారు. పరిశీలనకు వెళ్లినవారిపై క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసు నమోదు చేయడం చెల్లుబాటు కాదు. కోర్టులను ఆశ్రయించి అక్రమాలను అడ్డుకుంటున్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పిటిషనర్‌పై కేసు అందులో భాగమే. ఈ కేసులో పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలి’’ కోరారు.