రవాణ శాఖ లాటరీ టికెట్లు

ABN , First Publish Date - 2022-10-08T09:57:53+05:30 IST

రవాణ శాఖ లాటరీ టికెట్లు

రవాణ శాఖ లాటరీ టికెట్లు

నిధుల కోసం అధికారుల నిర్వాకం 


విజయనగరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాటరీల నిర్వహణ నిషేధం. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులే లాటరీ నిర్వహణకు స్కెచ్‌ వేశారు. రవాణా శాఖ నిర్వహణలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నట్టు టికెట్లు ముద్రించారు. పెద్దపెద్ద బ్యానర్లు ఏర్పాట్లు చేసి మరీ టికెట్ల అమ్మకాలకు రంగం సిద్ధం చేశారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి పండగ వేల ఈ తతంగం చోటు చేసుకుంది. పండగ నిర్వహణ ఖర్చుల కోసం లాటరీ వేస్తున్నట్టు ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల్లో విషయం హల్‌చల్‌ చేయడం, తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు వెనక్కి తగ్గారు. లాటరీ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో టికెట్ల అమ్మకాలు ఆపేసేందుకు ఉపక్రమించినట్లు సమాచారం. పట్టణంలో ఒకటి, రెండు చోట్ల ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు. కాగా, ఒక్కో టికెట్‌ను రూ.100 చొప్పున విక్రయించి, లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన ముగ్గురికి ద్విచక్ర వాహనాలు అందజేయనున్నట్టు టికెట్లపై ముద్రించారు. 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆనందగజపతి ఆడిటోరియంలో లక్కీ డ్రా తీయనున్నట్లు ప్రచురించారు. రవాణా శాఖ పేరుతో టికెట్లు ముద్రించారు. పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. వలంటీర్లకు సైతం బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రజలకు మూడు ద్విచక్ర వాహనాలు అంటగట్టి, వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసేందుకు వేసిన ప్లాన్‌ చివర్లో బెడిసి కొట్టింది. 

Updated Date - 2022-10-08T09:57:53+05:30 IST