ప్రాణహాని ఉంది... రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2022-04-24T10:05:10+05:30 IST

తనకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వాపోయారు.

ప్రాణహాని ఉంది... రక్షణ కల్పించండి

వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి ఆవేదన 


పులివెందుల, ఏప్రిల్‌ 23: తనకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వాపోయారు. శనివారం ఆయన పులివెందులలో మాట్లాడారు. ‘‘వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారడంతో నాకు ప్రాణహాని ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీబీ ఐ అధికారులకు, జిల్లా ఎస్పీకి వివరించాను. నా భద్రత కోసం మొదట్లో ఒక కానిస్టేబుల్‌ను, తర్వాత ఇద్దరిని ఏర్పాటు చేశారు. గన్‌మన్‌ను ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. నేను ఎక్కడికి వెళ్లినా సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌జీకి చెప్పాలని ఆదేశించారు. ఇలా చెప్పడానికి నేను ఫోన్‌ చేస్తే ఎత్తుతారా..? నన్ను కేసులో ఉన్న వ్యక్తిగానే చూస్తారు. నా రక్షణ కోసం నియమించిన కానిస్టేబుళ్లు నేను బయటకు వెళ్లాలంటేనే వస్తారు. అప్పుడప్పుడు ఇంటి దగ్గర కూడా ఉంటారు. భద్రత కల్పించడమంటే నేను ఎక్కడకు వెళ్లినా వెంట ఉండాలి కదా?’’ అని దస్తగిరి మొరపెట్టుకున్నారు. కాగా, వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న షేక్‌ దస్తగిరికి భద్రత కల్పిస్తున్నామని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ‘దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి అంటే 2021 డిసెంబరు 8నుంచి ఎస్పీ అన్బురాజన్‌ ఉత్తర్వుల మేరకు 1+1 పోలీసు సిబ్బందిని అతనికి రక్షణగా నియమించాం. దస్తగిరి ఇంటి సమీపంలో 1+3 శాశ్వత పికెట్‌ కొనసాగిస్తున్నాం. దస్తగిరి చెబుతున్న మాటలు అవాస్తవం’ అని డీఎస్పీ పేర్కొన్నారు.

Read more