గొంతు కోసి.. భజన సభలా..!

ABN , First Publish Date - 2022-12-07T03:27:09+05:30 IST

‘‘వైసీపీ ప్రభుత్వం తన మూడున్నరేళ్ల పాలనలో బీసీ వర్గాల గొంతు కోసి మళ్లీ భజన సభల పేరుతో ఆర్భాటం చేస్తోంది.

గొంతు కోసి.. భజన సభలా..!

టీడీపీ నుంచి వేరుచేయడానికి బీసీ జపం

వైసీపీపై తెలుగుదేశం బీసీ నేతల మండిపాటు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ వర్గాల అణచివేతపై ప్రదర్శన

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ప్రభుత్వం తన మూడున్నరేళ్ల పాలనలో బీసీ వర్గాల గొంతు కోసి మళ్లీ భజన సభల పేరుతో ఆర్భాటం చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి బీసీ వర్గాలు పెట్టని కోటగా నిలిచాయి. వారిని టీడీపీ నుంచి వేరు చేయడానికి సీఎం జగన్‌ ఇటీవల బీసీ జపం చేస్తున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. అధికార పార్టీ వైసీపీ ‘జయహో బీసీ’ పేరుతో విజయవాడలో బుధవారం ఒక సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇక్కడి తమ కేంద్ర కార్యాలయంలో బీసీ వర్గాల అణిచివేతపై ఒక ఫొటో ఎగ్జిబిషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, పల్లా శ్రీనివాసరావు, బీసీ విభాగం నేతలు వీరంకి గురుమూర్తి, నిమ్మల శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతరం టీడీపీ నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 2. 14 కోట్ల మంది బీసీలు, 134 కులాల వారు ఉన్నారు. అందులో కేవలం ఐదు కులాలకు చెందిన 47 లక్షల మందికి మాత్రం అరకొర సాయం ఇచ్చి అదే బీసీల ఉద్ధరణగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోంది. చంద్రబాబు ప్రభుత్వం రూ.34 వేల కోట్లతో బీసీల సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఐదుగురు రెడ్లకు రాష్ట్రాన్ని పంచి ఇచ్చి బీసీ మంత్రులను వారి కింద ఉత్సవ విగ్రహాల మాదిరిగా పెట్టారు.’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిది సినిమాలో చూపించిన 23వ పులకేశి క్యారెక్టరని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల వారికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని కళా వెంకట్రావు అభివర్ణించారు. జింకా వెంకట నరసయ్య అనే బీసీ వర్గీయుడిని చంపి అతని గనిని లాక్కోవడంతో వైఎస్‌ కుటుంబం ప్రస్థానం మొదలైందని, ఆ దోపిడీ ఇప్పటికి కొనసాగుతోందని బుద్దా వెంకన్న ఆరోపించారు. వైసీపీ పెడుతోంది బీసీ ద్రోహుల భజన సభని కొల్లు రవీంద్ర విమర్శించారు. రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ, ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత 26 మంది బీసీలు హ త్యకు గురయ్యారు. వందల సంఖ్యలో కేసులు పెట్టారు’’ అని విమర్శించారు.

నేడు కలెక్టరేట్ల ముందు టీడీపీ ధర్నాలు

జిల్లా కలెక్టరేట్ల ముందు బుధవారం తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. బీసీ వర్గాల సమస్యలపై ఆ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ‘ఇదేం ఖర్మ బీసీలకు’ అన్న నినాదంతో దీనిని జరుపుతున్నారు. గత మూడు రోజుల్లో ఆ పార్టీ మండల, నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. దాని కొనసాగింపుగా దీనిని చేపట్టారు.

Updated Date - 2022-12-07T03:27:10+05:30 IST