క్రాప్‌ హాలిడే జగన్‌ నిర్లక్ష్యమే

ABN , First Publish Date - 2022-06-12T08:35:07+05:30 IST

క్రాప్‌ హాలిడే జగన్‌ నిర్లక్ష్యమే

క్రాప్‌ హాలిడే జగన్‌ నిర్లక్ష్యమే

నిరుడు కూడా గోదావరి, కర్నూలు, కడపల్లో పంట విరామం

ధాన్యం బకాయిలు చెల్లించాలి

ముఖ్యమంత్రికి లోకేశ్‌ లేఖ

అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ‘రైతు రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చారు.. కానీ సీఎం జగన్‌రెడ్డి నిర్లక్ష్యంతో క్రాప్‌ హాలిడేలు ప్రకటిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లేని రాష్ట్రంగా మారుతోంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు పంట విరామం ప్రకటిస్తున్నారని తెలిపారు. గతేడాది కర్నూలు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో రైతులు పంట విరామం ప్రకటించినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో ఆ పరిస్థితి వచ్చేది కాదు’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి శనివారం ఆయన లేఖ రాశారు. ‘ఈ-క్రాప్‌ బుకింగ్‌లో సమస్యలు, సున్నావడ్డీకి రుణం ఇవ్వకపోవడం, మద్దతు ధర దక్కకపోవడం, ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు చెల్లించకపోవడం లాంటి సమస్యలను ప్రతిపక్షంగా టీడీపీ ఎప్పటికప్పుడు లేవనెత్తింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడితే ఒక్క రైతుకు కూడా పూర్తిగా సాయం చేయలేదు. వరి మద్దతు ధర పెంచకపోవడంతో వ్యవసాయం నష్టాలమయం అవుతోంది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడోస్థానంలో ఉంది. ఇప్పటికే మూడు వేలమంది ఆత్మహత్య చేసుకున్నారు. మీ సొంత జిల్లా కడపలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంట విరామం కొనసాగిస్తున్నారు. కేసీ కెనాల్‌ కింద 90వేల ఎకరాల ఆయకట్టు ఉంటే అత్యధిక రైతులు పంట వేయడం లేదు. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలన్న చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం మానేయాలి. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలి. క్రాప్‌ హాలిడే ప్రకటించిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలి’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Read more