అగ్నిమాపక శాఖలోఅవినీతి మంటలు!

ABN , First Publish Date - 2022-12-31T05:16:21+05:30 IST

అగ్నిమాపక శాఖలో అవినీతి మంటలు చెలరేగుతున్నాయి. ప్రతి పనికీ ‘నాకేంటి?’ అనే ఒక అధికారి తన పదవిని అడ్డం పెట్టుకుని రూ.కోట్లు గడించినట్టు శాఖలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అగ్నిమాపక శాఖలోఅవినీతి మంటలు!

ఎన్‌వోసీలకు ముడుపులు

ప్రాంతీయ స్థాయి అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు.. నిఘా పెట్టిన ప్రభుత్వం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అగ్నిమాపక శాఖలో అవినీతి మంటలు చెలరేగుతున్నాయి. ప్రతి పనికీ ‘నాకేంటి?’ అనే ఒక అధికారి తన పదవిని అడ్డం పెట్టుకుని రూ.కోట్లు గడించినట్టు శాఖలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని ప్రజలు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఎవరైనా పొరపాటున రూల్స్‌ మాట్లాడితే.. ఇక ఆ ఫైల్‌ అంతే! అనే స్థాయిలో అగ్ని మాపక శాఖ పరువును బజారున పడేస్తున్న అధికారి వైనం ఇప్పుడు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

ఎవరు? ఏంటి?

రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలో గ్రూప్‌ వన్‌ అధికారిగా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలు దాటుకుని ప్రధాన కార్యాలయంలో ప్రాంతీయ అధికారి హోదాలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన పేరులో ‘భగవంతుడు’ ఉన్నట్లే ఆయన కరుణలో ‘హుండీ’ కూడా ఉంటుంది. అలా ఆయన హుండీలో పడిన సొమ్ముతోపాటు ముడుపులు, దక్షిణల రూపంలో వచ్చిన సొమ్మును పొరుగు రాష్ట్రాల్లో బినామీల పేర్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారని సమాచారం. అంతేగాక సొంత జిల్లాలో షాపింగ్‌ కాంప్లెక్సును నిర్మించే స్థాయికి చేరడంతో ఆయన పేరు ఇప్పుడు అగ్నిమాపక శాఖలో దావాలనంలా విస్తరించింది. ఎన్‌వోసీల కోసం వేచిచూస్తున్న వేలాది మంది ఈయనకు ముడుపులు సమర్పించేందుకు సిద్ధమయ్యారు.

ఎన్‌వోసీతో ఆటలు

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి భవనాలు నిర్మించాలన్నా అగ్నిమాపక శాఖ ఇచ్చే నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తప్పనిసరి. పరిశ్రమలతోపాటు విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, అపార్ట్‌మెంట్స్‌, బహుళ అంతస్తుల భవనాలు ఇలా ఏది నిర్మించాలన్నా ఎన్‌వోసీ తీసుకోవాలి. అయితే, అగ్నిమాపక శాఖలో ఏడాదిన్నరగా ఓ ఉన్నతాధికారి తన సొంత నిర్ణయాలతో శాఖను భ్రష్టుపట్టించారని సిబ్బంది అంటున్నారు. పారదర్శకత కోసం గతంలో పనిచేసిన అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టిన ఎన్‌వోసీ విధానాన్ని ఆయన మార్చేశారు. ఒక మహిళా ఉద్యోగికి ముడుపులు చెల్లించి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు. రెండు నెలలుగా ఆ మహిళా ఉద్యోగి ఆఫీసుకు రాకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి నడుం బిగించిన ఆ అధికారి కర్ణాటక, తెలంగాణల్లోని ఏజెన్సీల ద్వారా బేరసారాలు మొదలు పెట్టారు. ఇలాంటి వ్యవహారాల్లో జిల్లాల్లో తనకున్న అనుభవంతో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. జిల్లాల్లో తనకు అనుకూలంగా ఉన్న అధికారులు తప్పు చేసినా రక్షించడం, కాదన్న వారిని సస్పెండ్‌ చేయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక మరో ఉన్నతాధికారి పాత్ర ఉందని సమాచారం. దీంతో ఆయన ఎవరు? ఏం చేశారనే దానిపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయని తెలిసింది. ఒక విద్యా సంస్థ భవనాలకు ఎన్‌వోసీ రెన్యువల్‌ కోసం ఏకంగా రూ.45 లక్షల మేరకు ముడుపులు డిమాండ్‌ చేయడంతో ఇది కాస్తా ప్రభుత్వ పెద్దల చెవిలో పడింది. దీంతో ఇప్పుడు ఈ ముడుపుల వ్యవహారాన్ని తేల్చేందుకు శాఖాపరమైన అంతర్గత దర్యాప్తు రహస్యంగా సాగుతున్నట్టు సమాచారం.

Updated Date - 2022-12-31T05:16:23+05:30 IST