పిల్లల సొమ్ములూ పీక్కున్నారు

ABN , First Publish Date - 2022-07-05T07:32:28+05:30 IST

అందినకాడికి అప్పులు చేస్తున్నా.. అడ్డగోలుగా పన్నులు బాదుతున్నా.. వైసీపీ సర్కారుకు నిధులు చాలడం లేదు. అవకాశమున్న చోటల్లా డబ్బులు లాగేసుకుంటోంది. చివరికి పిల్లల సొమ్ములూ వదలి..

పిల్లల సొమ్ములూ పీక్కున్నారు

పిల్లల సొమ్ములూ పాఠశాలల కాంపోజిట్‌ గ్రాంట్‌ వెనక్కి

ఇచ్చినట్టే ఇచ్చి లాగేసిన సర్కారు

పీడీ ఖాతాల క్లోజ్‌ పేరుతో మళ్లింపు

వేరే ఖాతాల్లో వేస్తామని హామీ

బడులు తెరిచినా నిధులివ్వని వైనం

పాఠశాలలపై నిర్వహణ భారం

చిన్నపాటి ఖర్చులకూ నిధులు కటకట


(అమరావతి--ఆంధ్రజ్యోతి)

అందినకాడికి అప్పులు చేస్తున్నా.. అడ్డగోలుగా పన్నులు బాదుతున్నా.. వైసీపీ సర్కారుకు నిధులు చాలడం లేదు. అవకాశమున్న చోటల్లా డబ్బులు లాగేసుకుంటోంది. చివరికి పిల్లల సొమ్ములూ వదలి పెట్టలేదు. పాఠశాలల నిర్వహణ కోసం గత మార్చిలో ఇచ్చిన కాంపోజిట్‌ గ్రాంట్లనూ  వెనక్కి తీసేసుకుంది. పీడీ ఖాతాలు క్లోజ్‌ చేస్తున్నామనే పేరుతో నగదు మళ్లించింది. వేరే ఖాతాల్లో ఆ నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ బడులు పునఃప్రారంభమవుతున్నా ఆ నిధులను పాఠశాలలకు ఇవ్వలేదు. దీంతో పాఠశాలలకు నిర్వహణ భారంగా మారింది.


ప్రతి ఏటా సమగ్ర శిక్ష నుంచి పాఠశాలలకు నిర్వహణ నిమిత్తం కాంపోజిట్‌ గ్రాంట్లు మంజూరు చేస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.25 వేల వరకు, ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ నిధులు ఇస్తారు. గతేడాది రాష్ట్రంలోని 37,729 ప్రాథమిక పాఠశాలలకు రూ.79.84 కోట్లు, 7073 ఉన్నత పాఠశాలలకు రూ.42.17 కోట్లు కేటాయించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 15 మంది లోపు ఉంటే రూ.12,500, 15 నుంచి 100 మంది లోపు ఉంటే రూ.25 వేలు.. ఉన్నత పాఠశాలల్లో 100 నుంచి 250 మంది లోపు ఉంటే రూ.50 వేలు, 250 నుంచి 1000 మంది లోపు ఉంటే రూ.75 వేలు, 1000 మంది దాటితే రూ.లక్ష చొప్పున కాంపోజిట్‌ గ్రాంట్లు ఇచ్చారు. గత విద్యా సంవత్సరంలో కూడా అటూ ఇటూగా అంతే మొత్తం ఇచ్చారు. ఏటా ఇలా ఇచ్చిన నిధుల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన వాటిని వెనక్కి తీసుకుంటారు. కానీ గత విద్యా సంవత్సరంలో ఖర్చు చేయలేదనే కారణంతో కాకుండా, పీడీ ఖాతాలు క్లోజ్‌ చేస్తున్నామని, వేరే ఖాతాల్లో ఈ నగదు జమ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఒకే మండలంలో రూ.26 లక్షలు ఇలా లాగేసుకుంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఆ నిధులు ఇస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా.. ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. 


పాఠశాలల్లో నిధులలేమి: ప్రభుత్వం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో పాఠశాలల నిర్వహణకు  నిధులు లేకుండాపోయాయి. చిన్నాచితకా ఖర్చులకు కూడా ప్రధానోపాధ్యాయుల వద్ద డబ్బు లేదు. సాధారణంగా పాఠశాలల్లో ఏవైనా చిన్నపాటి రిపేర్లు, తాగునీరు, విద్యుత్‌ బిల్లులు, ఇంటర్నెట్‌ బిల్లులు, గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ, ఇతరత్రా చిన్నపాటి అవసరాలకు కాంపోజిట్‌ గ్రాంట్‌ వినియోగిస్తారు. కానీ ఇప్పుడు ఎవరి జేబులో నుంచి డబ్బులు వాడాలి? అనే పరిస్థితి వచ్చింది. 


ఎంఈవోలు, హెచ్‌ఎంలపై భారం: ఇప్పుడు పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యా కానుక కిట్లను ప్రధానోపాధ్యాయులు బడులకు తీసుకెళ్లాలి. స్కూల్‌ కాంప్లెక్సులు, ఎంఈవో కార్యాలయాల నుంచి వాటిని తరలించాలి. ఎంఈవో కార్యాలయాల వరకు వీటిని రవాణా చేస్తున్న ప్రభుత్వం.. ఆ తర్వాత పాఠశాలలకు రవాణా చేయడానికి డబ్బులు ఇవ్వడం లేదు. అలాగని వాటిని పాఠశాలలకు చేర్చకపోతే ఎంఈవోలు,  హెచ్‌ఎంలు బాధ్యులవుతారు. దీంతో జగనన్న విద్యా కానుక కిట్లు, పాఠ్య పుస్తకాల రవాణా ఖర్చులను ఎంఈవోలు, హెచ్‌ఎంలు సొంతంగా భరిస్తున్నారు. వీలైనంత త్వరగా పాఠశాలలకు చేర్చాలని ఒత్తిడి చేస్తున్న ఉన్నతాధికారులు.. రవాణా ఖర్చులు ఎవరు భరించాలనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.

Updated Date - 2022-07-05T07:32:28+05:30 IST