లంక భూములపై కమిటీ

ABN , First Publish Date - 2022-12-31T05:09:59+05:30 IST

లంక భూముల కేటగిరీలను మార్చడానికి ప్రభుత్వం జిల్లా జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వాన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారి (ఆర్‌డీవో), రివర్‌ కన్సర్వేటర్‌ (ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌)లు సభ్యులుగా ఉంటారు.

లంక భూములపై కమిటీ

కేటగిరీ మార్పుపై సర్కారు నియామకం

ఇక సీ కేటగిరీ భూములు ఐదేళ్ల లీజుకు

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): లంక భూముల కేటగిరీలను మార్చడానికి ప్రభుత్వం జిల్లా జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వాన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారి (ఆర్‌డీవో), రివర్‌ కన్సర్వేటర్‌ (ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌)లు సభ్యులుగా ఉంటారు. శుక్రవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ దీనిపై ఉత్తర్వులు (జీవో-598) జారీ చేశారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఏర్పడిన లంకలను ఏ, బీ, సీ కేటగిరీలుగా పరిగణిస్తున్నారు. ఏ కేటగిరీలో జిరాయితీ భూములు ఎక్కువగా ఉంటాయి. బీ కేటగిరీ అంటే ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. సీ కేటగిరీలో నదీ ప్రవాహం పెరిగినప్పుడు లేదా దిశ, దశ మారినప్పుడు తాత్కాలికంగా ఏర్పడే లంకలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా సాగు భూములు ఉంటాయి. ఇంతకుముందు లంక భూములను పేదలు, బడుగు వర్గాలకు డీకేటీ పట్టాల రూపంలో అందించారు. ఇందులో సాగు భూములతో పాటు ఇళ్ల స్థలాలున్నాయి. రైతుల సహకార సొసైటీల (సీజేఎఫ్‌) పేరిట కూడా భూములు ఇచ్చారు. లంక భూముల కేటగిరీ మార్చేందుకు ఇంతకు ముందు కలెక్టర్‌కే అధికారం ఉండేది. ఇప్పుడు నిబంధనలను సరళతరం చేస్తూ జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. లోగడ ఇచ్చిన జీవో 970కి ఈ మేరకు సవరణలు చేశారు. ఏ నుంచి సీకి, సీ నుంచి బీకి భూముల కేటగిరీ మార్చాలంటే ఈ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీ కేటగిరీ లంక భూములను ఇంతకుముందు ఏటా ఒక సంవత్సరానికి లీజుకు ఇచ్చేవారు. ఇకపై ఐదేళ్లకోసారి లీజుకు ఇవ్వాలని తెలిపారు. భూమిపై ఎవరెవరు ఉన్నారో నిర్ధారించుకునేందుకు రైతుల సాగు వివరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇంకా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహార మందుల వినియోగం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా పేర్కొన్నారు. సీ కేటగిరి లీజు దరఖాస్తులను స్థానికంగా విచారణ చేయకుండా తిరస్కరించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతకుముందు సహకార సొసైటీలకు భూము లిచ్చి ఉంటే, ఇప్పుడవి అందుబాటులో లేకున్నా రైతులకు మేలు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. నాడు సాగు చేసుకున్న రైతులకు రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్‌ (బీఎ్‌సఓ-15) ప్రకారం వ్యక్తిగతంగా డీకేటీ పట్టాలు ఇవ్వాలని ఆదేశించింది. రైతులు లేనిపక్షంలో వారి వారసులు దరఖాస్తు చేసుకున్నా అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఒకవేళ సొసైటీల పరిధిలో ఖాళీ భూమి ఉంటే, అర్హులైన సభ్యులు, వారి వారసులు కూడా అందుబాటులో లేకుం టే స్థానికంగా భూమిలేని పేదలను గుర్తించి వారికి పట్టాలివ్వాలని పేర్కొంది. ఇప్పటికే గ్రామ అడంగల్‌లో రైతుల పేర్లుంటే వాటిని తొలగించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-31T05:10:06+05:30 IST

Read more