నాపై సీఐడీ కేసును కొట్టేయండి!

ABN , First Publish Date - 2022-10-11T09:20:17+05:30 IST

సీఎం జగన్‌ సతీమణి భారతి ప్రతిష్ఠను దిగజార్చేలా ఐ-టీడీపీ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారంటూ గుంటూరుకు చెందిన షేక్‌ రబ్బానీ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన

నాపై సీఐడీ కేసును కొట్టేయండి!

హైకోర్టును ఆశ్రయించిన చింతకాయల విజయ్‌


అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి), గుంటూరు: సీఎం జగన్‌ సతీమణి భారతి ప్రతిష్ఠను దిగజార్చేలా ఐ-టీడీపీ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారంటూ గుంటూరుకు చెందిన షేక్‌ రబ్బానీ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఐ-టీడీపీ విభాగానికి తాను ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని తెలిపారు. అయితే, ఆ విభాగానికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఐ-టీడీపీ అకౌంట్‌ను తానే సృష్టించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా లేదని, ట్విట్టర్‌ అకౌంట్‌కు అసలు ప్రెసిడెంట్‌ అనే పదవి ఉండదని, అదేమీ ఓ సంస్థ లేదా సొసైటీ కాదని పిటిషన్‌లో వివరించారు.


నోటీసులు ఇచ్చే పేరుతో సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించారని, సోదాలు చేశారని, డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా, ఇంట్లోని మహిళలు, చిన్నపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించి భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవని తెలిపారు. కేవలం రాజకీయంగా కక్షసాధించేందుకు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నోరెత్తకుండా చేసే దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని విజయ్‌ అభ్యర్థించారు. సీఐడీ అధికారుల అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని 2 రోజుల గడువిస్తే కోర్టు దృష్టికి తెస్తామని న్యాయవాదులు కొటేశ్వరరావు,మాగులూరి హరిబాబు పేర్కొన్నారు.

Read more