చీరాల, పేరాల ఉద్యమానికి నేటితో వందేళ్లు

ABN , First Publish Date - 2022-04-25T08:28:03+05:30 IST

చైతన్యం వారి సొంతం. అలుపెరగని పోరాటాలకు వారు స్ఫూర్తి. పోరాటాల పురిటిగడ్డగా పేరు.

చీరాల, పేరాల ఉద్యమానికి నేటితో వందేళ్లు

ఈ రెండు గ్రామాలను కలిపి ఏకపక్షంగా మున్సిపాలిటీగా ప్రకటన

పన్నుల భారమంటూ ప్రజల తీవ్ర నిరసన

వారికి ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల సారథ్యం

గాంధీజీ సూచనతో గ్రామ బహిష్కరణ

పన్నులు చెల్లించకుండా.. 11 నెలలు సహాయ నిరాకరణ

దుగ్గిరాల అరెస్టుతోనూ ఆగని ఉద్యమ ఉధృతి

దీంతో వెనక్కి తగ్గిన బ్రిటిష్‌ ప్రభుత్వం

‘మున్సిపాలిటీ’ నిర్ణయం రద్దు

నేడు కాంగ్రెస్‌ పాదయాత్ర


చీరాల, ఏప్రిల్‌ 24: చైతన్యం వారి సొంతం. అలుపెరగని పోరాటాలకు వారు స్ఫూర్తి. పోరాటాల పురిటిగడ్డగా పేరు. స్వాతంత్ర్యోద్యమంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందటం అందుకు కారణం. అదే చీరాల(క్షీరపురి), పేరాల ఉద్యమం. దానికి నాయకత్వం వహించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిరస్మరణీయుడు. చీరాల, పేరాల ఉద్యమానికి సోమవారంతో వందేళ్లు పూర్తవుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ ఉద్యమానికి వందేళ్లు నిండినందున చీరాలలో పాదయాత్రకు సిద్ధమైంది. 


ఉద్యమ నేపథ్యం...

చీరాల, పేరాల రెండు గ్రామాలు. రెండు పంచాయతీలు. 1919లో ఈ గ్రామాలలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. పారిశుధ్య నిర్వహణ, ఖర్చులగాను ఆదాయవనరులను పెంపొందించుకునేందుకు ఆ రెండు పంచాయతీలను కలపి పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యవతిరేకించారు. పన్నులు భారం మోయలేకపోవడం అందుకు కారణం. వారి నిరసన చుక్కానిలేని నావగా ఉన్న క్రమంలో ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వారికి నాయకత్వం వహించేందుకు సిద్ధపడ్డారు. విషయాన్ని ఆయన మహాత్మాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. పన్నులు చెల్లించకుండా శాంతియుతంగా నిరసన తెలపాలని.. లేకపోతే గ్రామాలను ఖాళీచేసి గ్రామ బహిష్కరణ చేయాలని గాంధీజీ సూచించారు. 1921 ఏప్రిల్‌ 6న మహాత్ముడు చీరాల వచ్చారు. ఆయన ప్రతిపాదించిన అంశాల్లో బహిష్కరణకే దుగ్గిరాల మొగ్గుచూపారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 25న చీరాల, పేరాల ప్రజలు గ్రామాలను వీడి ఈపూరుపాలెం కరకట్టలపై గుడిసెలు వేసుకున్నారు. పన్నులు చెల్లించబోమని బ్రిటిష్‌ ప్రభుత్వానికి స్పష్టంచేశారు. అప్పటికే శ్రీరామదండు పేరుతో ఓ సైన్యాన్ని తయారుచేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటున్న దుగ్గిరాల... చీరాల, పేరాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. సుమారు 15వేల మంది ఆయన మాటపై నిలిచారు. పాకలు వేసుకున్న ప్రాంతానికి రామనగర్‌ అని నామకరణం చేశారు. అయితే కొత్తగా గుడిసెల నిర్మాణాలకు, జీవనభృతికి కొంత సమస్య ఏర్పడింది. దుగ్గిరాల ఎన్నోచోట్ల ప్రసంగాలు చేసి విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచారు. సుమారు 11నెలల పాటు ఈ పోరాటం, సహాయ నిరాకరణ కొనసాగింది. చర్చల పేరుతో సహాయ నిరాకరణ, గ్రామ బహిష్కరణ వీడాలని బ్రిటిష్‌ ప్రభుత్వం సూచించింది. అందుకు జనం ఒప్పుకోలేదు. తర్వాత బరంపురంలో దుగ్గిరాలను బ్రిటిష్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మరికొందరిని అరెస్టు చేశారు. వీరిలో స్వాతంత్ర్యోద్యమంలో జైలుకు వెళ్లిన తొలిమహిళగా గుర్తింపుపొందిన వేటపాలెంకు చెందిన అలివేలు మంగతాయారు ఉన్నారు. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు.. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వమే దిగివచ్చింది. మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల-పేరాల ప్రజల ఉద్యమం స్వాతంత్య్రపోరాటంలో ఓ మైలురాయిగా నిలిచింది.


కలగా మిగిలిన దుగ్గిరాల స్మారక కేంద్రం

దుగ్గిరాల పరమపదించాక ప్రస్తుత ఆర్టీసీ గ్యారేజీ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో దుగ్గిరాల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. స్మారక కేంద్రం నిర్మాణం కలగానే మిగిలింది.


పార్టీలకతీతంగా పాల్గొనాలి...

చీరాల, పేరాల ఉద్యమానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా చీరాలలో సోమవారం పాదయాత్రకు కాంగ్రెస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మెయ్యప్పన్‌, పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, మాజీ ఎంపీ జేడీశీలం పిలుపిచ్చారు. పాదయాత్ర సోమవారం సాయంత్రం చీరాలలోని ముక్కోణపుపార్కు సెంటర్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బాలుర హైస్కూల్‌, ముంతావారిసెంటర్‌, మార్కెట్‌ సెంటర్‌, గడియార స్తంభం సెంటర్‌ మీదుగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్యపార్కు వద్దకు చేరుకుంటుందని తెలిపారు. అక్కడ గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించాక బహిరంగ సభ  జరుగుతుందన్నారు.

Updated Date - 2022-04-25T08:28:03+05:30 IST