గర్జన కాదది.. గారడీ!: అయ్యన్న
ABN , First Publish Date - 2022-10-17T10:17:31+05:30 IST
ఎన్నికలొస్తున్న తరుణంలో విశాఖపై మొసలి కన్నీరు కారిస్తే మోసపోవటానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులేమీ కాదని గర్జన షో ఫ్లాప్‌తో నిరూపితమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికలొస్తున్న తరుణంలో విశాఖపై మొసలి కన్నీరు కారిస్తే మోసపోవటానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులేమీ కాదని గర్జన షో ఫ్లాప్‌తో నిరూపితమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసే కబ్జాకోరుల గర్జనపై వరుణ దేవుడు కూడా నీళ్లు చల్లాడని ఎద్దేవా చేశారు. ‘‘మూడు రాజధానుల ఏర్పాటుకు అధికారం జగన్‌రెడ్డికి లేదని కోర్టులు స్పష్టం చేసినా, ఉత్తరాంధ్రను దోచుకోవటానికే మూడు ముక్కలాటతో ప్రాంతీయ, కుల చిచ్చు పెడుతున్నారు. కబ్జాకోరుల గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారు. కపట నాటకాలు, కృత్రిమ ఉద్యమాలు, బలవంతపు జనసమీకరణలు.. జగన్‌రెడ్డి ముఠా దోపిడీపై వచ్చే ప్రజాసునామీని ఆపలేవు’’ అని అయ్యన్న హెచ్చరించారు.